Mallya Celebraion: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)పై 6 రన్స్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి, 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. RCB మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 190 రన్స్ సాధించింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్‌ను RCB వైపు మళ్లించాడు. యష్ దయాల్ , భువనేశ్వర్ కుమార్ కీలక వికెట్లు తీసి విజయాన్ని అందించారు.
ఈ విజయం తర్వాత అనేక మంది రియాక్షన్స్ వైరల్ అయ్యాయి. వీరిలో విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, ఈ విజయాన్ని టీవీలో చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, RCB విజయం సాధించిన క్షణాల్లో అతను మోకాళ్లపై కూర్చుని, ఆనందంతో చేతులు ఎత్తి, కన్నీళ్లు పెట్టుకున్నాడు. "ఎట్టకేలకు! 18 సంవత్సరాలు... ఎట్టకేలకు కప్పు కొట్టాం" అని అతను భావోద్వేగంతో అరిచాడు. ఈ వీడియో వైరల్ అయింది.
RCB మాజీ యజమాని విజయ్ మాల్యా. ఆయన కూడా ట్వీట్ చేశారు. "RCB ఎట్టకేలకు 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025 టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ప్రదర్శన. అద్భుతమైన కోచింగ్,సపోర్ట్ స్టాఫ్‌తో ధైర్యంగా ఆడారు. అభినందనలు! ఈ సాలా కప్ నమ్దే!!" అని రాశాడు. అతను 2008లో RCBని కొన్నప్పుడు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్లను ఎంచుకున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.
విజయ్ మాల్యా, RCBని 2008లో 480 కోట్లకు కొనుగోలు చేశారు. బ్యాంకుల్ని మోసగించారన్న ఆరోపణలతో 2016లో దేశం విడిచి యూకేకు పారిపోయాడు. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో ఆయనను కంపెనీల నుంచి తొలగించారు. RCB యాజమాన్యం ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో గ్రూప్) వద్ద ఉంది.