LSG vs MI IPL 2024 Lucknow Super Giants won by 4 wkts: ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ లో లక్నో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తరువాత బరిలో దిగిన లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టాయినిస్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 62 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ 28 పరుగులు , దీపక్ హుడా 18 పరుగులు చేశారు. ముంబై బౌలింగ్లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషార, కొయెట్జీ, నబీ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. ఈ దెబ్బకి ఆరో విజయం తన ఖాతాలో వేసుకున్న లక్నో మూడో స్థానానికి ఎగబాకింది.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఇలా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో... ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇది సరైన నిర్ణయమే అని కాసేపటికే నిరూపితమైంది. ఏడు పరుగులకే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. అయిదు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన రోహిత్ శర్మను మోసిన్ ఖాన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఆరు బంతుల్లో పది పరుగులు చేసిన సూర్యాను స్టోయినిస్ అవుట్ చేశాడు. దీంతో 18 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ కష్టాలు తర్వాత కూడా కొనసాగాయి. 27 పరుగుల వద్ద ఏడు పరుగులు చేసిన తిలక్ వర్మ అవుటవ్వగా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత ఇషాన్ కిషన్, నెహల్ వధేరా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరూ ముంబై స్కోరును 27 పరుగుల నుంచి 80 పరుగులకు తీసుకెళ్లగా మళ్లీ ముంబైకు షాక్ తగిలింది. 36 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు. కాసేపటికే వదేరా కూడా పెవిలియన్ చేరాడు. 41 బంతుల్లో నాలుగు పోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేసిన వధేరాను మోహిన్ ఖాన్ బౌల్డ్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 పరుగులు చేయడంతో ముంబై 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మెహిన్ ఖాన్ 2, స్టోయినిస్ 1, మయాంక్ యాదవ్ ఒక వికెట్ తీశారు.