Rajasthan Royals vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.


యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) నిస్వార్థమైన ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను దగ్గరుండి గెలిపించాడు. తనకు సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అంతకు ముందు కోల్‌కతా బ్యాటర్లలో అర్థ సెంచరీ సాధించిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీని యశస్వి జైస్వాల్ సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ అర్థ శతకం పూర్తయింది.


150 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు తుపాన్ ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా వేసిన మొదటి ఓవర్లోనే 26 పరుగులు సాధించాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్ (0: 3 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత యశస్వికి కెప్టెన్ సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జతకలిశాడు. వీరు రెండో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించారు. ఆఖర్లో సెంచరీ దగ్గరలో కూడా యశస్వి జైస్వాల్ జట్టు ప్రయోజనాల కోసం మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. శతకానికి రెండు పరుగులు దూరంలో ఆగిపోయాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ నిదానంగా ప్రారంభం అయింది. స్కోరు బోర్డుపై 30 పరుగులు చేరే లోపే ఓపెనర్లు జేసన్ రాయ్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (18: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఇద్దరూ విఫలం అయ్యారు.


వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు ఫోర్లు), కెప్టెన్ నితీష్ రాణా (22: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాక నితీష్ రాణాను అవుట్ చేసి చాహల్ కోల్‌కతాను దెబ్బ కొట్టారు. ఆండ్రీ రసెల్ (10: 10 బంతుల్లో, ఒక సిక్సర్) విఫలం కాగా, రింకూ సింగ్ (16: 18 బంతుల్లో, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు.


అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వెంకటేష్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన వాళ్లు వేగంగా ఆడలేకపోయారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.