Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: 89కే సగం జట్టు పెవిలియన్‌లో కూర్చుంది. క్రీజులో శార్దూల్ ఠాకూర్ (68: 29 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), రింకూ సింగ్ (46: 33 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఉన్నారు. మహా అయితే 150 కొడతారేమో అనుకున్నారంతా. కానీ శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ అలా అనుకోలేదు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించి ఆరో వికెట్‌కు 7.3 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు విజయానికి 120 బంతుల్లో 205 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (3: 7 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ (0: 1 బంతి), కెప్టెన్ నితీష్ రాణా (1: 5 బంతుల్లో) ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో కోల్‌కతా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అయితే మరో ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (57: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రింకూ సింగ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రహమనుల్లా గుర్బాజ్ తన అర్థ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ దశలో కరణ్ శర్మ కోల్‌కతాను గట్టి దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్రీజులో కుదురుకున్న రహమనుల్లా గుర్బాజ్, డేంజరస్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రసెల్‌లను (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఇక కోల్‌కతా పని అయిపోయిందనుకున్న సమయంలో ఊహించిన ఉప్పెనలా శార్దూల్ ఠాకూర్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తనకు రింకూ సింగ్ చక్కటి సహకారం అందించాడు. ఇన్నింగ్స్ ముందుకు సాగే కొద్దీ రింకూ కూడా వేగం పెంచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కేవలం 7.3 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రింకూ సింగ్,  20వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ అవుటయ్యారు. కానీ అప్పటికే బెంగళూరు భారీ స్కోరు కొట్టేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లకు తలో వికెట్ దక్కింది.


కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
మన్‌దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి


ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఎన్ జగదీసన్, డేవిడ్ వైస్


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్


ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
ఫిన్ అలెన్, సోను యాదవ్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్