IPL 2026 KKR VS PBKS Match Called Off: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
కోల్‌కతాలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగి పోయింది.

IPl 2026 KKR Vs PBKS Latest Updates: ఐపీఎల్ 2026 సీజన్‌లో మొదటి విజయం కోసం తహతహలాడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కు వరుణుడు షాక్ ఇచ్చాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారింది. ఎడతెరిపి లేని వర్షం, చిత్తడి మైదానం కారణంగా మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకుముందు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోమ్ టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3.4 ఓవర్లలో 25 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో చినుకులు మొదలై, అది కాస్తా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంగా మారింది. ఆ తర్వాత ఎంతకూ ఆట ముందుకు సాగలేదు.
Match 1⃣2⃣ between @KKRiders and @PunjabKingsIPL has been called off due to wet outfield 🌧️
— IndianPremierLeague (@IPL) April 6, 2026
Both teams get a point each.#TATAIPL | #KhelBindaas | #KKRvPBKS pic.twitter.com/FpRpfljBpo
గ్రీన్ అట్టర్ ఫ్లాప్ షో
ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్లెట్ తన స్వింగ్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను వణికించాడు. కేవలం మూడు బంతుల వ్యవధిలో ఇద్దరు స్టార్ ఓవర్సీస్ ప్లేయర్లను పెవిలియన్ పంపాడు. రూ. 25.20 కోట్లు పోసి కొనుగోలు చేసిన కేమరూన్ గ్రీన్ (4) మరోసారి విఫలమయ్యాడు. ఓపెనర్ ఫిన్ అలెన్ (6) కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. వరుసగా మూడవ మ్యాచ్‌లో కూడా గ్రీన్ ఘోరంగా ఫెయిల్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అయితే అప్పటికే క్రీజులో ఉన్న కెప్టెన్ అజింక్య రహానే (8), యంగ్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ (7) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా వర్షం తీవ్రమై ఆట నిలిచిపోయింది.
షారుఖ్ ఖాన్ రాక
బాలీవుడ్ సూపర్ స్టార్, కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ ఈ సీజన్‌లో మొదటిసారి తన టీమ్‌ను ఉత్సాహపరచడానికి స్టేడియానికి వచ్చాడు. కానీ ఆయన కు షాకిస్తూ వర్షం వల్ల ఆట రద్దయ్యింది.. సోమవారం కావడం, ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల స్టేడియంలో కేవలం 29,358 మంది ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యారు. వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ స్టేడియం ఖాళీ చేసి వెనుదిరిగారు. గతేడాది కూడా ఇదే తేదీన (ఏప్రిల్ 6) పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ వర్షం వల్ల రద్దై తలో పాయింట్ పంచుకున్నాయి.
లక్నో మ్యాచ్ కు అంతరాయం..!
బంగాళా ఖాతాలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉంది. కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడాల్సి ఉంది. ఆ రోజు కూడా వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
















