KKR vs DC IPL 2024 Kolkata Knight Riders won by 7 wkts: ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌(KKR) ఘన విజయం సాధించింది. 153 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 21బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి కోల్‌కత్తా సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ను కోల్‌కత్తా బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులకు పరిమితమైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తాకు సాల్ట్‌ సునాయస విజయాన్ని అందించాడు.  శ్రేయస్‌ అయ్యర్‌ 33 పరుగులు , వెంకటేశ్‌ అయ్యర్‌ 26 పరుగులు చేశారు. 

ఢిల్లీ ఇన్నింగ్స్ ఇలా.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని కోల్‌కత్తా బౌలర్లు వణికించారు. 17 పరుగుల వద్ద మొదలైన ఢిల్లీ బ్యాటర్ల పతనం చివరి వరకూ కొనసాగింది.  17 పరుగుల వద్ద 7 బంతుల్లో మూడు ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీ షా పెవిలియన్‌ చేరాడు.   ఆ తర్వాత అతి కొద్ది సేపటికే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్న జాక్‌ ఫ్రేజర్‌ మెక్‌ గర్క్‌ కూడా అవుట్‌ కావడంతో ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. 7 బంతుల్లో ఒక ఫోర‌్, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేసిన మెక్‌గర్క్‌ను స్టార్క్‌ అవుట్‌ చేశాడు. దీంతో 30 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా పంత్‌ సేన కష్టాలు కొనసాగాయి.

37 పరుగుల వద్ద ఢిల్లీ మరో వికెట్‌ కోల్పోయింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేసిన షాయ్‌ హోప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ని రిషబ్‌ పంత్‌ అభిషేక్‌ పోరెల్‌ ఢిల్లీని ఆదుకునే ప్రయత్నం చేశార. కానీ కోల్‌కత్తా బౌలర్లు పట్టు వదల్లేదు. 15 బంతుల్లో 18 పరుగులు చేసిన  అభిషేక్‌ పోరెల్‌ను హర్షిత్‌ రాణా అవుట్‌ చేయగా కుమార కుషగర ఇలా వచ్చి ఒకే పరుగు చేసి అలా పెవిలియన్‌కు చేరాడు. రిషభ్‌పంత్‌ కూడా 27 పరుగులు చేసి అవుట్‌ కావడంతో ఢిల్లీ 93 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్కోరు బోర్డుపై మరో పది పరుగులైనా చేరకుండానే స్టబ్స్‌... అక్షర్‌ పటేల్‌ కూడా అవుటయ్యారు. కానీ చివర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఢిల్లీని ఆదుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో 34 పరుగులు చేసి ఢిల్లీ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడగలిగింది. కుల్‌దీప్‌ పోరాటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.