Vaibhav Suryavanshi, IPL 2025 Auction:
బీహార్‌కు చెందిన 13 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)... ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు ఇది. కేవలం 13 ఏళ్లకే ఈ క్రికెటర్.. కోటీశ్వరుడిగా మారిపోయాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ మెగా వేలంలోకి అతడిని రూ.1.10కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. వైభవ్ కోసం ఢిల్లీ కూడా పోటీ పడింది. కాగా, అతడు తొలిసారిగా ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. దీంతో ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వైభవ్ ఈ ఏడాదే బిహార్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అండర్-19 యూత్ టెస్టులో భారత్ తరఫున ఆస్ట్రేలియా జట్టుపై కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. యూత్ టెస్టుల్లో ఇదే అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం. ఐపీఎల్ బరిలోకి దిగి వైభవ్ మరెన్ని రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.
తప్పకుండా ఆకట్టుకుంటాడు..
వైభవ్ సూర్యవంశీ నాగ్‌పూర్‌లోని తమ హై పెర్ఫామెన్స్ సెంటర్‌కి వచ్చాడని.. అక్కడ అతని బ్యాటింగ్ తమను ఎంతగానో ఆకట్టుకుందని.. వేలం ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్‌క్రం చెప్పారు. " వైభవ్ చాలా ప్రతిభావంతుడు, అతని ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంది. అందుకే అతను చిన్న వయసులోనే ఐపీఎల్ వరకు వచ్చాడు. అతనిని మేం మరింత సానబెట్టాలి. రాబోయే మాకు చాలా పని ఉంటుంది, నిజంగా ప్రతిభావంతుడైన ఆటగాడు మాకు తగ్గాడు. వైభవ్ ఫ్రాంచైజీలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది." అని రాజస్థాన్ రాయల్స్ సీఈవో జేక్ లష్ మెక్‌క్రం వెల్లడించాడు.
ఇదీ నేపథ్యం..
వైభవ్ సూర్యవంశీ బిహార్ కు చెందిన ఆటగాడు. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్తిపూర్ వైభవ్ స్వస్థలం. ముంబైపై ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన వైభవ్... ఇప్పటివరకూ ఐదు రంజీ ట్రోఫీ మ్యాచులు ఆడాడు. బీహార్ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ 20 మ్యాచులు ఆడుతున్నాడు. అండర్ 19లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. సూర్యవంశీని 13 సంవత్సరాల 187 రోజుల వయసులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ ప్రస్తుత కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో పేరిట ఉన్న 14 సంవత్సరాల 241 రోజుల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. సూర్యవంశీ బీహార్‌లో జరిగిన U-19 టోర్నమెంట్, రణధీర్ వర్మ టోర్నమెంట్‌లో అజేయంగా 332 పరుగులతో ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. బ్రియాన్ లారా అంటే వైభవ్ కు చాలా ఇష్టం. వైభవ్ సూర్యవంశీకి అతని తండ్రే మొదటి కోచ్. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ. సంజీవ్ కూడా క్రికెటర్. కానీ ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాడు. అనంతరం కోచింగ్ ఇస్తున్నాడు.
ఐపీఎల్ ఆడేందుకు అర్హుడేనా?
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో ఆడేందుకు అర్హుడా కాదా అని చర్చ జరుగుతోంది. టీనేజ్ బాలుడు అంతర్జాతీయ క్రికెటర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు వయసు నిబంధన ఉంది. కనీసం 15 ఏళ్లు ఉంటేనే అంతర్జాతీయ క్రికెట్ ఆడనిస్తారు. కానీ ఐపీఎల్ లాంటి లీగ్‌లో ఆడేందుకు ఇప్పటివరకూ ఎలాంటి వయసు నిబంధనలు లేవు. దాంతో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో అరంగేట్రం చేయడానికి ఏ అడ్డంకులు లేవు. అయితే అతడి వయసు సరైనదా కాదా అనేది హాట్ టాపిక్ అయింది.