IPL 2024 SRH Records: ఐపీఎల్‌(IPL)-17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) జట్టు బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌(MI)తో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్‌ చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన  జట్టుగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడారు. క్లాసెన్‌ 80,అభిషేక్‌ శర్మ 63, ట్రావిస్‌ హెడ్‌ 62, మార్‌క్రమ్‌ 42 వీరవిహారం చేశారు.



ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, కోయెట్జీ, పీయూష్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీశారు. భారీ లక్ష్య ఛేధనలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ 64, టిమ్‌ డేవిడ్‌ 42, నమన్‌ ధీర్‌ 30 పరుగులు చేశారు. ప్యాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. 





మరో రికార్డు
మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో 10 ఓవర్ల అనంతరం అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీనికి ముందు తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్‌ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో ముంబై తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 





IPLలో మొదటి 10 ఓవర్లలో భారీ స్కోర్లు..
148/2 - హైదరాబాద్‌vs ముంబై, హైదరాబాద్, 2024 
141/2 – ముంబై vs హైదరాబాద్‌ , హైదరాబాద్, 2024 
131/3 - ముంబై vs హెదరాబాద్‌, అబుదాబి, 2021 
131/3 - పంజాబ్‌ vs హైదరాబాద్‌, హైదరాబాద్, 2014 
130/0 - డెక్కన్ ఛార్జర్స్ vs ముంబై, ముంబై, 2008 
129/0 - బెంగళూరు vs పంజాబ్‌ , బెంగళూరు, 2016 


ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక
     సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే జట్టుగా ఇప్పటివరకూ పేరొంది. ఏదో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు రాణించడం... తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయాలను అందించడం సన్‌రైజర్స్‌ జట్టులో పరిపాటి. కానీ ఈ ఆటతీరులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏదో పూనకం వచ్చినట్లు... తమ జట్టును తక్కువగా అంచనా వేస్తున్నారన్న కోపం కావచ్చు.. తమను తాము నిరూపించుకోవాలన్న కసి కావచ్చు.. తాము ఆడితే ఎలా ఉంటుందో క్రికెట్‌ ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశం కావచ్చు.... కారణమేదైనా సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు... ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపారు. తమను తక్కువ చేసి చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇచ్చేశారు. ఏదో ఒక బ్యాటర్‌ కాదు... హెడ్‌, అభిషేక్ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్‌క్రమ్‌ ఇలా విధ్వంసకర బ్యాటర్లు... ప్రత్యర్థి జట్ల బౌలర్లకు గట్టి సవాల్‌ విసిరారు.