IPL 2024 RCB vs KKR kolkatta won by 7 Wickets : కోల్‌కతా(KKR) చేతిలో బెంగళూరు(RCB) చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. విరాట్‌ కోహ్లీ 83 పరుగులతో  రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (83 నాటౌట్‌; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కామెరూన్‌ గ్రీన్‌ (33), మాక్స్‌వెల్‌ (28), దినేశ్‌ కార్తీక్‌ (20) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా, రస్సెల్‌ చెరో 2, నరైన్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా 19 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వెంకటేష్‌ అయ్యర్‌ 50, సునీల్‌ నరైన్‌ 47, అయ్యర్‌ 39, సాల్ట్‌ 30 పరుగులతో రాణించారు.


 
కోహ్లీ కడదాక నిలిచి..


మిచెల్‌ స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్‌తో కోహ్లీ పరుగుల ఖాతా తెరిచాడు. హర్షిత్‌ రాణా వేసిన రెండో ఓవర్‌లో బెంగళూరుకు షాక్‌ తగిలింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి డుప్లెసిస్‌ పెవిలియన్‌ బాట పట్టాడుమిచెల్‌ స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌లో బెంగళూరు వరుస బౌండరీలు కొట్టింది. కోహ్లీ ఒక సిక్స్‌, ఫోర్‌ కొట్టగా.. కామెరూన్‌ గ్రీన్‌ బౌండరీ బాదాడు. పవర్‌ ప్లే పూర్తి.. బెంగళూరు 61 పరుగులు చేసింది. సునీల్‌ నరైన్‌ వేసిన ఆరో ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. చివరి మూడు బంతుల్లో గ్రీన్‌ 4,4,6 కొట్టాడు. తర్వాత బెంగళూరుకు మరో షాక్‌ తగిలింది. రస్సెల్‌ బౌలింగ్‌లో కామెరూన్‌ గ్రీన్‌ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. పది ఓవర్‌లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కోహ్లీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. హర్షిత్‌ రాణా వేసిన 14వ ఓవర్‌లో మాక్స్‌వెల్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. తర్వాత నరైన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. రస్సెల్‌ బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. బెంగళూరు బ్యాటర్‌ అనుజ్‌ రావత్‌ను హర్షిత్‌ రాణా అవుటయ్యాడు. 18 ఓవర్లకు బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రస్సెల్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌ రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి బంతికి దినేశ్‌ కార్తీక్‌ రనౌట్‌ కావడంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 182 పరుగులు చేసింది. 


ఆ గొడవ ముగిసిపోయింది


 గత సీజన్ లో బద్ద శత్రువులుగా మారిన  ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఒకటైపోయారు.  ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ చాలా మమ్ములుగా వచ్చి కోహ్లీ దగ్గరికి వచ్చి అభినందించాడు. ఒకరినొకరు నవ్వుతూ  హగ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌ స్ట్రాటజిక్ టైమ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.