IPL 2024: ఐపీఎల్ 2024లో బుధవారం సాయంత్రం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ భారీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీనికి తోడు ఆ టీం కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు జరిమానా పడింది. స్లో ఓవర్‌ రేట్ కారణంగా రిషబ్‌ 24 లక్షలు ఫైన్‌ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.


ఈ ఐపిఎల్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఇలా జరిమానా చెల్లించడం పంత్‌కు ఇది రెండోసారి. గతంలో కూడా ఓ మ్యాచ్‌లో పంత్‌పై జరిమానా పడింది. ఇప్పుడు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే విధంగా ఫైన్‌ పడింది. ఇప్పుడు పడిన జరినామా మాత్రం మొత్తం జట్టు చెల్లించాల్సి ఉంటుంది. 


విశాఖపట్నంలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్‌లో కోల్‌కతా టీం బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే బౌలింగ్ మార్చడం, ఫీల్డింగ్ సరిచేయడానికి పంత్ ఎక్కువ టైం తీసుకున్నారు. దీని కారణంగా ఓవర్లపై ఎఫెక్ట్ పడింది. స్లో ఓవర్‌ రేట్ కారణంగా జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 


కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కు కెప్టెన్‌ పంత్‌పై 24 లక్షల రూపాయల జరిమానా పడింది. మిగతా ఆటగాళ్లపై కూడా జరిమానా విధించారు. వాళ్లు ఆరు లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 


విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్‌ను కోల్‌కతా బ్యాటర్లు చీల్చి చెండాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 272 పరుగులు చేశారు. బ్యాటర్లంతా సిక్సర్స్ ఫోర్లతో రెచ్చిపోయారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్‌ కేవలం 166 పరుగులు మాత్రమే చేసింది. మొదటి నుంచి క్రమంగా వికెట్లు పడిపోవడంతో 106 పరుగులతో ఓటమి చవిచూసింది. ఇందులో పంత్‌తోపాటు ట్రిస్టన్‌ స్టబ్స్‌ మాత్రమే రాణించారు. రిషబ్‌ 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్‌లో నాలుగు ఫోర్స్‌, ఐదు సిక్లు బాదాడు.  స్టబ్స్‌ 32 బంతుల్లో 54 పరుగులు చేశాడు.


ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాగులు మ్యాచ్‌లలో మూడింట ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్న ఏకైక జట్టు ముంబై ఇండియన్స్‌. ఢిల్లీ కంటే ఒక్కస్థానం పైన ఉంది రాయల్‌ ఛాలెంజర్స్ ఆఫ్‌ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్‌  ఆడిన నాలుగు మ్యాచ్‌లో చెన్నైపైనే విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది.