Sunrisers Hyderabad Vs Punjab Kings Head to Head: ఐపీఎల్‌లో నేడు (ఆదివారం) రాత్రి జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు సన్‌రైజర్స్ మాత్రం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు ఎంతో కీలకం.


గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంది. ఐపీఎల్ 2021, ఐపీఎల్ 2022 సీజన్లలో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ కూడా గత కొన్ని సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలం అవుతుంది. ఈ రెండు జట్లూ ఉప్పల్ స్టేడియంలో తలపడటానికి రెడీ అవుతున్నాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ టు హెడ్ రికార్డులు
ఈ రెండు జట్లూ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌కు మాత్రం ఏడు విజయాలు మాత్రమే దక్కాయి. ఇక ఐపీఎల్ ట్రోఫీ విజయాల్లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌నే ముందుంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఇప్పటికి ఒక్కసారి కూడా ట్రోఫీని దక్కించుకోలేదు.


సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల్లో టాప్ పెర్ఫార్మర్స్ వీరే!
పంజాబ్ కింగ్స్‌పై డేవిడ్ వార్నర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ పంజాబ్ కింగ్స్‌పై డేవిడ్ వార్నర్ ఏకంగా 700 పరుగులు చేశాడు. కానీ వార్నర్ ఇప్పుడు హైదరాబాద్ తరఫున ఆడటం లేదు. ఆ తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ (307), శిఖర్ ధావన్ (306) అత్యధిక స్కోరర్లుగా ఉన్నారు. వీరిలో కూడా కేఎల్ రాహుల్ ప్రస్తుతం పంజాబ్ తరఫున ఆడటం లేదు. ఇక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (23) అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. భువీ తర్వాతి స్థానాల్లో రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఉన్నారు. కానీ రషీద్ ఖాన్, సందీప్ శర్మ ఇప్పుడు ఈ రెండు జట్ల తరఫున కూడా ఆడటం లేదు.


గత సీజన్లో ఈ రెండు జట్ల గేమ్స్ ఎలా జరిగాయి?
ఈ రెండు జట్లూ చివరి సారిగా ఐపీఎల్ 2022లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ కింగ్స్ కేవలం 15.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.