Shubman Gill Records: ఐపీఎల్ 16వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో అనేక కొత్త రికార్డులు నమోదయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో లీగ్ దశను ముగించింది.
104 పరుగులతో అజేయ శతకం బాదిన శుభ్‌మన్ గిల్ ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ఇప్పుడు నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 23 ఏళ్ల 255 రోజుల వయసులో ఈ రికార్డును సాధించాడు.
వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడు
2023 సంవత్సరం ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్‌కి చాలా కలిసొచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో గిల్ 14 ఇన్నింగ్స్‌ల్లో 56.67 సగటుతో 680 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 101 పరుగులు చేశాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించిన గిల్ 104 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ సాధించిన 104 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇంతకుముందు రికార్డు కూడా శుభ్‌మన్ గిల్ పేరు మీదనే ఉంది. ఇంతకు ముందు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శుభ్‌మన్ గిల్ 101 పరుగులు సాధించి ఈ రికార్డు సాధించాడు.
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ ఓడించి ఇంటికి పంపించేసింది. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ పాలిట వరం అయింది. వారు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్: 52 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) అజేయమైన సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 61 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరికీ ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. వీళ్లిద్దరూ గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే సెంచరీలు సాధించారు.