Ravindra Jadeja's 300th T20 Match: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా ఈరోజు తన 300వ టీ20 మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 27వ తేదీ) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా తన కెరీర్‌లో 300వ టీ20 మ్యాచ్‌ను ఆడుతున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.


ఈ ప్రత్యేక జాబితాలోకి రవీంద్ర జడేజా
300 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజా చేరాడు. 414 టీ20 మ్యాచ్‌లతో రోహిత్ శర్మ ఈ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది భారత ఆటగాళ్లు 300 లేదా అంతకంటే ఎక్కువ టీ20లు ఆడారు.


300 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు
రోహిత్ శర్మ - 414 టీ20 మ్యాచ్‌లు.దినేష్ కార్తీక్ - 381 టీ20 మ్యాచ్‌లు.
మహేంద్ర సింగ్ ధోని - 369 టీ20 మ్యాచ్‌లు.
విరాట్ కోహ్లీ - 368 టీ20 మ్యాచ్‌లు.
సురేష్ రైనా - 368 టీ20 మ్యాచ్‌లు.
శిఖర్ ధావన్ - 322 టీ20 మ్యాచ్‌లు.
రవి అశ్విన్ - 304 టీ20 మ్యాచ్‌లు
రవి జడేజా - 300 టీ20 మ్యాచ్‌లు.


రవీంద్ర జడేజా టీ20 కెరీర్
నేటి మ్యాచ్‌ను తీసేస్తే రవీంద్ర జడేజా తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 299 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 213 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన జడ్డూ 25.40 సగటు, 128.78 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3226 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని అత్యధిక స్కోరు 62 నాటౌట్‌గా ఉంది.


మొత్తం 268 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా 30.11 సగటుతో 204 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను 7.56 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. అలాగే అతని అత్యుత్తమ గణాంకాలు 5/16.


ఐపీఎల్ 2023లో ఎలా ఆడాడు?
ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రవీంద్ర జడేజా ప్రదర్శన గురించి చెప్పాలంటే అతను మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసిన జడేజా 57 పరుగులు చేశాడు. అలాగే ఏడు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన జడేజా 17.60 సగటుతో 10 వికెట్లు తీసుకున్నాడు.   


టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్ల మైలురాయిని కూడా జడ్డూ అందుకున్నాడు. దీని కారణంగా డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ లాంటి దిగ్గజ బౌలర్ల సరసన రవీంద్ర జడేజా నిలిచాడు. 296 టీ20లు ఆడిన జడేజా 30.25 బౌలింగ్ యావరేజ్‌తో 200 వికెట్లను పడగొట్టాడు. గతంలో 16 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను జడేజా పడగొట్టాడు. ఇదే అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.


ఇప్పటి వరకు 64 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా 28.49 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఎకానమీ రేటు 7.04గా ఉండటం విశేషం. 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో రవీంద్ర జడేజా చెన్నై, రాజస్థాన్, గుజరాత్ లయన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంఛైజీలకు ఆడాడు. మొత్తంగా 214 మ్యాచ్‍‌ల్లో 30.05 సగటుతో 138 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన 11వ బౌలర్‌గా నిలిచాడు.