IPL 2023, MI vs GT:
వాంఖడే టాప్ లేచిపోయింది.. అభిమానులు ఊగిపోయారు.. ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు సంతోషంలో మునిగి తేలారు! సచిన్ వంటి దిగ్గజమే మనసులో చిందులేశాడు! అన్నింటికీ ఒక్కటే రీజన్! సూర్యకుమార్ యాదవ్ తొలి సెంచరీ అందుకోవడం! క్రీజులో 360 డిగ్రీల్లో డాన్స్ చేయడం! హిట్‌మ్యాన్ సేనకు భారీ స్కోరు అందించడం!
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబయి ఇండియన్స్ దుమ్మురేపింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించింది. 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (103*; 49 బంతుల్లో 11x4, 6x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇషాన్ కిషన్ (31; 20 బంతుల్లో 4x4, 1x6), విష్ణు వినోద్ (30; 20 బంతుల్లో 2x4, 2x6) అతడికి అండగా నిలిచారు. రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.
ఫార్ములా.. దంచికొట్టడం!
టార్గెట్ పెట్టినా.. ఛేజ్ చేసినా.. ముంబయి ఇండియన్స్ ఒకే ఫార్ములా అనుసరిస్తోంది! దొరికిన బంతిని దొరికినట్టే బౌండరీ పంపించాలని కంకణం కట్టుకుంది. గుజరాత్ పైనా అలాగే ఆడింది. పవర్‌ప్లే ముగిసే సరికే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (29; 18 బంతుల్లో) అమేజింగ్ పాట్నర్‌షిప్ అందించారు. ఏడో ఓవర్లో వీరిద్దరినీ రషీద్ ఖాన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. నేహాల్ వధేరా (15)నూ అతడే పెవిలియన్‌కు పంపించాడు. అప్పటికి స్కోరు 88. ఆ తర్వాతే అసలు ఊచకోత మొదలైంది.
స్కై ఫస్ట్ సెంచరీ!
సూర్యకుమార్ యాదవ్, విష్ణు వినోద్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించారు. నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆడిన ప్రతి ఓవర్లోనూ పది పరుగుల చొప్పున సాధించారు. దాంతో ముంబయి 10.6 ఓవర్లకే 100కు చేరుకుంది. సూర్యాభాయ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో విష్ణు వినోద్ ఔటయ్యాక తనలోని ఉగ్రరూపాన్ని బయటకు తీసుకొచ్చాడు. క్రీజుకు అటూ.. ఇటూ కదులుతూ ప్రతి బౌలర్‌నూ వణికించాడు. 18.6 ఓవర్లకు స్కోరును 218కి చేర్చాడు. ఆఖరి ఓవర్‌కు ముందు 87తో నిలిచిన అతడు.. ఆఖరి మూడు బంతుల్ని 6, 2, 6గా మలిచి తొలి సెంచరీ కిరీటం ధరించాడు. 49 బంతుల్లోనే ఈ ఘనత అందుకొని స్కోరును 218/5కు చేర్చాడు.