IPL 2023, RCB vs LSG: చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చుక్కెదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో బెంగళూరు ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో తరఫున నికోలస్ పూరన్ (62: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (65: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.


213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్ (0: 3 బంతుల్లో), దీపక్ హుడా (9: 10 బంతుల్లో, ఒక ఫోర్), కృనాల్ పాండ్యా (0: 2 బంతుల్లో) ఘోరంగా విఫలం అయ్యారు. లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంక బెంగళూరు కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.


కానీ మార్కస్ స్టోయినిస్ అలా అనుకోలేదు. లక్ష్యం భారీగా ఉంది కాబట్టి మొదటి బంతి నుంచి వేగంగా ఆడాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (17: 18 బంతుల్లో, ఒక ఫోర్త) తనకు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక స్టోయినిస్‌ను కరణ్ శర్మ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే కేఎల్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో లక్నో తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది. కానీ పూరన్ అవుటై పోయాక లక్నో వికెట్లు వరుసగా కోల్పోయింది. చివరి ఓవర్లో కొట్టాల్సింది ఐదు పరుగులే అయినా హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. దీంతో చివరి బంతికి బై రన్‌ ద్వారా లక్నో విజయం సాధించింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (61: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (79 నాటౌట్: 46 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) పూర్తి సాధికారికతతో ఆడారు. లక్నో బౌలర్లకు అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. కోహ్లీ అర్థ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనంతరం విరాట్‌ను అమిత్ మిశ్రా అవుట్ చేశాడు.


విరాట్ స్థానంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్  (59: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. మెల్లగా డుఫ్లెసిస్ కూడా గేర్లు మార్చాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తను కొట్టిన బంతి స్టేడియం బయట పడటం విశేషం. 118 మీటర్ల భారీ సిక్సర్ అది. రెండో వికెట్‌కు 115 పరుగులు జోడించిన అనంతరం చివరి ఓవర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి బెంగళూరు 212 పరుగులు చేసింది.