(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023, LSG vs SRH: స్పిన్ పిచ్‌లో పేస్‌తో అటాక్! లక్నో చేతిలో ఓడిన సన్‌రైజర్స్!
IPL 2023, LSG vs SRH: ఐపీఎల్ సరికొత్త సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జోష్‌లో ఉంది. శుక్రవారం రెండో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది.
IPL 2023, LSG vs SRH:
ఐపీఎల్ సరికొత్త సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జోష్‌లో ఉంది. శుక్రవారం రెండో విజయం సాధించింది. ఏకనా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని తేలికగా ఛేదించింది. 4 ఓవర్లు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలుపు ఢంకా మోగించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (35; 31 బంతుల్లో 4x4) గెలుపు ఇన్నింగ్స్ ఆడాడు. కృనాల్ పాండ్య (34; 23 బంతుల్లో 4x4, 1x6) మెరిశాడు. అంతకు ముందు ఆరెంజ్ ఆర్మీలో రాహుల్ త్రిపాఠి (34; 41 బంతుల్లో 4x4), అన్మోల్‌ప్రీత్ సింగ్ (31; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్ స్కోరర్లు. కృనాల్ పాండ్య (3/18), అమిత్ మిశ్రా (2/23) తమ స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.
లేటుగా స్పిన్నర్ల ఎంట్రీ!
ట్రికీ టార్గెట్.. ఊహించని విధంగా టర్న్ అవుతున్న బంతి.. బౌన్స్ లేని మందకొడి పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలించని పరిస్థితి! అయినప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విఫల వ్యూహాలతో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్‌ను తేలికగా ఛేదించింది. అదేంటో... ఆరెంజ్ ఆర్మీ స్పిన్నర్లకు బదులు పేసర్లతోనే ఎక్కువ ఓవర్లు వేయించింది. అదే వారి కొంప ముంచింది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ ఫోకస్‌గా ఆడాడు. కైల్ మేయర్స్ (13), దీపక్ హుడా (7) త్వరగా ఔటైనా ఓపికగా నిలిచాడు. తొలి వికెట్‌కు 35 (27 బంతుల్లో), కృనాల్ పాండ్యతో మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 55 రన్స్ పాట్నర్ షిప్ నెలకొల్పాడు. ఒకవైపు రాహుల్ క్లాస్‌తో ఆచితూచి.. మరోవైపు కృనాల్ దూకుడుగా బౌండరీలు బాదాడు. జట్టు స్కోరు 100 వద్ద కృనాల్‌ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. 114 వద్ద రాహుల్, రొమారియో షెఫర్డ్ (0)ను ఆదిల్ రషీద్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపించాడు. చేయాల్సిన పరుగులు తక్కువే కావడంతో మార్కస్ స్టాయినిస్ (10*), నికోలస్ పూరన్ (11*) జట్టును విజయ తీరాలకు చేర్చారు.
టర్న్ చేసిన పాండ్య!
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌కు మంచి ఓపెనింగే వచ్చింది. అన్మోల్‌ప్రీత్, మయాంక్ అగర్వాల్ (8) కలిసి తొలి వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కృనాల్ పాండ్య బంతి పట్టుకున్నాకే పిచ్ ఎంత కఠినంగా ఉందో తెలిసింది. అస్సలు బౌన్స్ లేదు. బంతి ఆగి.. ఆగి.. వస్తోంది. ఎక్కువ డిగ్రీలు టర్న్ అవుతోంది. షాట్లు ఆడేందుకు అస్సలు కుదర్లేదు. దాంతో 2.5వ బంతికే మయాంక్‌ను పాండ్య ఎల్బీ చేశాడు. ఆ తర్వాత త్రిపాఠితో కలిసి రెండో వికెట్‌కు అన్మోల్ 30 బంతుల్లో 29 పరుగుల పాట్నర్ షిప్ అందించాడు. అతడినీ 7.5వ బంతికి పాండ్యనే ఔట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ (0)ను బౌల్డ్ చేశాడు. జట్టు స్కోరు 55 కాస్ట్లీ ప్లేయర్ హ్యారీబ్రూక్ (3)ను రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడి స్టంపౌట్ అయ్యాడు.
అమిత్ మిశ్రా అదుర్స్!
కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌ను రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ (16; 28 బంతుల్లో) ఆదుకున్నారు. వికెట్లు పడకుండా మెల్లగా ఆడారు. నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 39 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు. అయితే జట్టు స్కోరు 94 వద్ద త్రిపాఠిని యశ్ ఠాకూర్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. మరికాసేపటికే వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్ (4)ను అమిత్ మిశ్రా పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ (21*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు ఆడి స్కోరును 121/8కు చేర్చాడు. చివరి ఓవర్లో ఉనద్కత్ రెండు సిక్సర్లు ఇవ్వకపోతే లక్నో టార్గెట్ ఇంకా తక్కువే అయ్యేది.