Impact Player in IPL: ఇంపాక్ట్ ప్లేయర్... ఇటీవలే బీసీసీఐ ప్రయోగాత్మకంగా ఈ రూల్ ను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీన్ని వచ్చే ఐపీఎల్ లోనూ వర్తింపజేయనున్నారు. అయితే అందులో కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని బీసీసీఐ ఫ్రాంచైజీలకు చెప్పింది. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటుంది కానీ.. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఆటగాడు భారత్ కు చెందిన వాడే అయి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. 


తుది జట్టులో నలుగురు  విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కచ్చితంగా భారత ఆటగాడే అయి ఉండాలి. అలాకాక ప్లేయింగ్ ఎలెవన్ లో నలుగురు కంటే తక్కువ విదేశీ ప్లేయర్లు ఆడితే.. అప్పుడు అరుదైన సందర్భాలలో మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ గా విదేశీ ఆటగాడిని ఆ జట్టు ఎంచుకోవచ్చు. అని బీసీసీఐ వివరించింది. జట్టు లిస్టులో పేర్కొన్న నలుగురు సబ్ స్టిట్యూట్లలో భాగమైన విదేశీ ఆటగాడు మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవాలని బీసీసీఐ తెలిపింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని నియమాలు తెలిపింది. 


 



  • కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్ ని నామినేట్ చేస్తాడు.

  • ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు ఇంపాక్ట్ ప్లేయర్ ని తీసుకోవచ్చు.  లేదా

  • ఓవర్ పూర్తయిన తర్వాత తీసుకోవచ్చు. లేదా

  • వికెట్ పడినప్పుడు, రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగినప్పుడు. 

  • వికెట్ పడిన సమయంలో బౌలింగ్ చేసే జట్టు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవచ్చు. అయితే ఓవర్ మధ్యలో వికెట్ పడితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆటగాడు బౌలింగ్ చేసే వీలుండదు. 

  • ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడో అతను ఇక మ్యాచ్ లో పాల్గొనడానికి వీల్లేదు. ఫీల్డర్ గా కూడా అతడిని తీసుకోకూడదు. 


ఇంపాక్ట్ ప్లేయర్ అంటే?


మ్యాచ్ ప్రారంభించే ముందు టాస్ వేస్తారు కదా. అలా టాస్ వేసేటప్పుడు ప్రతి జట్టు ఆడే 11 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తుంది. అప్పుడే తుది జట్టుతోపాటు మరో నలుగురు సబ్ స్టిట్యూచ్ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాలి. అందులో ఒకరిని మ్యాచ్ మధ్యలో తుది జట్టులోకి తీసుకునే అవకాశముంటుంది. ఆ వచ్చిన ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేయవచ్చు. ప్రతి ఇన్నింగ్స్ లో 14వ ఓవర్ పూర్తయ్యేలోపు ఈ రూల్ ను బ్యాటింగ్, బౌలింగ్ జట్లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా ఫీల్డ్ అంపైర్ కు చెప్పాలి.