Ravindra Jadeja as CSK New Captain First reactions : చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తనను నమ్మి ఇంతపెద్ద బాధ్యతలను అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే తాను భర్తీ చేయాల్సింది ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) పాత్రనని పేర్కొన్నాడు. అదంత సులభం కాదని వెల్లడించాడు. అతడి వారసత్వం ముందుకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనిగా వర్ణించాడు.


జడ్డూ స్పందించిన వీడియోను సీఎస్‌కే (CSK) తన ట్విటర్లో పెట్టింది. 'జడ్డూ ఫస్ట్‌ రియాక్షన్‌' అని కామెంట్‌ పెట్టింది. 'చాలా బాగుంది. అదే సమయంలో నేను భర్తీ చేసేదీ చిన్న బాధ్యతను కాదు. మహీ భాయ్‌ ఇప్పటికే గొప్ప వారసత్వాన్ని సృష్టించాడు. దానిని నేను కొనసాగించాల్సి ఉంది' అని జడ్డూ అన్నాడు. 'నేనేం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ధోనీ భాయ్‌ నా పక్కనే ఉంటాడు. నాకే అవసరం వచ్చినా అతడివద్దకు వెళ్తాను. అతనెప్పటికీ నాతోనే ఉంటాడు. అందుకే నాకు వర్రీ లేదు. మీ అందరి విషెస్‌, లవ్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్‌ చేయండి' అని జడ్డూ అన్నాడు.





ఐపీఎల్‌ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించడం జడ్డూకు అంత సులభమేం కాదు! ఎందుకంటే సీఎస్‌కే ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగు పెడుతోంది. పైగా జట్టులోకి చాలామంది కొత్తగా వచ్చారు. వారి ఆటతీరును అర్థం చేసుకోవాలి. కొందరు ఆటగాళ్లు గాయపడ్డారు. చాలా మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. జట్టుకు సమతూకం తీసుకురావడం అవసరం. ఇక సీఎస్‌కే ఈ సీజన్‌ తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మార్చి 26న తలపడనుంది.






సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం అందరినీ షాక్‌ చేసింది. అతడు జడ్డూకు నాయకత్వ బాధ్యతలు అందించాడని యాజమాన్యం చెప్పింది. 'చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఎంఎస్‌ ధోనీ నిర్ణయించాడు. జట్టును నడిపించేందుకు రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. 2012 నుంచి జడ్డూ సీఎస్‌కేలో అంతర్భాగంగా ఉన్నాడు. ఈ జట్టును నడిపించే మూడో కెప్టెన్‌ అతడు. ధోనీ ఈ సీజన్లో, ఇకపైనా చెన్నై సూపర్‌కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తాడు' అని సీఎస్‌కే ప్రకటించింది. మొత్తంగా నాలుగు సార్లు చెన్నైని ధోనీ ఛాంపియన్‌గా నిలబెట్టాడు.


Also Read: ధోనీ ది గ్రేట్‌! తలా.. నీ రికార్డులు తలదన్నేవారే లేరు!


Also Read: మళ్లీ షాకిచ్చిన ధోనీ! జడ్డూకు CSK కెప్టెన్సీ అప్పగించిన మిస్టర్‌ కూల్‌!