IPL 2022 rr vs rcb qualifier 2: భారతీయులంటే తనకెంతో గౌరవమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (Faf Du Plessis) అంటున్నాడు. తమ జట్టుపై వారు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేశాడు. భారత దేశ సంస్కృతి తనకు ప్రేరణ కల్పించిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
'ఈ దేశ ప్రజలు మమ్మల్నెంతో ప్రేమిస్తున్నారు. బయో బుడగలో ఉన్నా, బయటకు వచ్చినా ఎంతో ఆదరిస్తారు. హోటల్‌కు వెళ్లినప్పుడు రాత్రి 3 గంటల వరకు పనిచేస్తూ కనిపిస్తుంటారు. మళ్లీ ఉదయం 7 గంటలకే బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేస్తారు. వారు మాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. మేం బస చేసిన హోటల్లోనే కాదు దేశమంతా ఇలాగే ఉంటారు. భారతదేశ సంస్కృతిలోని గొప్పదనం ఇదే' అని డుప్లెసిస్ అన్నాడు.
రాజస్థాన్ మ్యాచులో తాము తక్కువ స్కోర్ చేశామని డుప్లెసిస్ పేర్కొన్నాడు. 'మేం బౌలింగ్ చేస్తున్నప్పుడు మా స్కోర్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. మొదటి 3, 4 ఓవర్లు మూమెంట్ కనిపించింది. 180 స్కోర్ చేసుంటే బాగుండేది. తొలి ఆరు ఓవర్లైతే టెస్టు క్రికెట్ ఆడుతున్నట్టు అనిపించింది. మిగతా వికెట్లతో పోలిస్తే మొతేరా పిచ్ వేగంగా ఉంది. ఇన్నింగ్స్ సాగే కొద్దీ వేగం తగ్గింది' అని వెల్లడించాడు.
'ఆర్సీబీకి ఇదో మంచి సీజన్. గర్వంగా అనిపిస్తోంది. జట్టులో నాకిదే తొలి సీజన్. అయినా ప్రజలంతా ఆదరించారు. మాకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. కొందరు అద్భుతంగా ఆడారు. హర్షల్‌పటేల్ టీమ్‌ఇండియాకు ఎంపికయ్యారు. ఈ ఓటమి మమ్మల్ని నిరాశపరిచింది. రాజస్థాన్ చాలా పోటీనిచ్చింది. విజయానికి వారు అర్హులే. మా జట్టులో యువ ప్రతిభావంతులు ఆకట్టుకున్నారు. మాకు మూడేళ్ల ప్రణాళిక ఉంది. కొత్త కుర్రాళ్లను తీసుకున్నాం. వారిలో కొందరు సూపర్‌స్టార్లు అవుతారు. రజత్‌ను చూశాం. అతడెంతో సునాయాసంగా ఆడాడు. టీమ్‌ఇండియా భవిష్యత్తు తార అవుతాడు. ఐపీఎల్ ముగియగానే మూడు భారత జట్లను తయారు చేసుకోవచ్చు. అంత ఎక్కువ యంగ్ టాలెంట్ ఉందిక్కడ' అని డుప్లెసిస్ వెల్లడించాడు.