IPL 2022 dc given target of  216 runs against kkr in match 19 brabourne stadium: ఐపీఎల్‌ 2022లో 19వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) భారీ స్కోరు చేసింది. నాటు కొట్టుడు కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఎక్కడా జోరు తగ్గించలేదు. ప్రత్యర్థి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) కు 216 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (61; 45 బంతుల్లో 6x4 2x6), పృథ్వీ షా (51; 29 బంతుల్లో 7x4 2x6) సూపర్బ్‌ హాఫ్‌ సెంచరీలతో ఇరగదీశారు. కేకేఆర్‌ బౌలర్లను ఉతికారేశారు. 


వార్నర్‌ 'షా' షో!


శ్రేయస్‌ అయ్యర్‌ టాస్‌ గెలవడంతో దిల్లీ క్యాపిటల్స్‌ (DC) మొదట బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. పిచ్‌, వాతావరణం ఛేజింగ్‌కు అనుకూలిస్తుందని తెలియడంతో డీసీ తెలివిగా ఆడింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టింది. పృథ్వీ షా (Prithvi Shaw) చివరి మ్యాచులో ఎక్కడ ఆపేశాడో అక్కడే మొదలు పెట్టాడు. మరోవైపు తొలి మ్యాచులో ఆకట్టుకోని డేవిడ్‌ వార్నర్‌ (David Warner) ట్రెండీ షాట్లతో ఉతికారేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి వీరిద్దరూ వికెట్‌ నష్టపోకుండా 68 పరుగులు చేశారు. దాంతో ప్రతి ఓవర్‌కు పది పరుగులు వచ్చాయి.


ఆఖర్లో శార్దూల్‌ సిక్సర్లు


షా 27 బంతుల్లో, వార్నర్‌ 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేశారు. వీరిద్దరూ ఇదే ఊపు కొనసాగిండచంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లకు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్‌ (27; 14 బంతుల్లో 2x4, 2x6) టెంపో మిస్సవ్వకుండా భారీ షాట్లు ఆడాడు. 13 ఓవర్లకే 148-2తో ఉన్న దిల్లీకి ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. కేకేఆర్‌ బౌలర్లు కాస్త పరుగుల్ని నియంత్రించి లలిత్‌ యాదవ్‌ (1), రోమన్‌ పావెల్‌ (8), డేవిడ్‌ వార్నర్‌ను ఔట్‌ చేశారు. అప్పటికి దిల్లీ 166-5తో నిలిచింది. ఆఖర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (29*; 11 బంతుల్లో 1x4, 3x6), అక్షర్‌ పటేల్‌ (22*; 14 బంతుల్లో 2x4, 1x6) మెరుపులతో స్కోరు 215-5కు చేరుకుంది.