IND vs SA Tour: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat kohli)కి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నారు! త్వరలో జరిగే దక్షిణాఫ్రికా సిరీసుకు అతడిని ఎంపిక చేయడం లేదని తెలిసింది. పేలవ ఫామ్ నుంచి బయటపడేందుకు అతడికీ విరామం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇతర సీనియర్లకూ రెస్టు ఇస్తారని సమాచారం.
ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ప్రపంచకప్ ముందు జట్టును నిర్మించుకొనేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టీమ్‌ఇండియా ఐర్లాండుకు పయనమవుతుంది. ఈ రెండు సిరీసుల్లో కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని సెలక్షన్ కమిటీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ అందుబాటులో ఉంటాడు.
'ఒక ఆటగాడు పేలవ ఫామ్ ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ఇది చాలా సాధారణం. మేం ఎలాగూ కొందరు కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. దాంతో కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇస్తాం. విరాట్‌కూ విరామం ఇస్తాం. అతడు ఆడాలనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. టీమ్ సెలక్షన్ మీటింగ్ సమయంలో అతడిలో మాట్లాడతాం' అని సెలక్షన్ కమిటీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాకు గొప్ప సేవకుడని బీసీసీఐ అంటోంది. అతడు ఫామ్‌లోకి రావాలని కోరుకుంటోంది. 'భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ గొప్ప సేవకుడు. కొన్ని రోజులుగా అతడి ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సెలక్టర్లు, బీసీసీఐ అతడి గురించి ఆలోచిస్తోంది. అయితే మేం సెలక్షన్ కమిటీ విషయాల్లో కలగజేసుకోం. విరాట్, ఇతరులపై సెలక్టర్లే తుది నిర్ణయం తీసుకుంటారు. వారి ప్రదర్శనను మేం జడ్జ్ చేయం. కోహ్లీ విషయంలో ఏం జరుగుతుందో వారు చూసుకుంటారు' అని బీసీసీఐ అధికార వర్గాలు అంటున్నాయి.
ఐపీఎల్ తర్వాత ముగిసిన వారం రోజులకే దక్షిణాఫ్రికా సిరీసు మొదలవుతుంది. జూన్ 9-19 వరకు టీ20 మ్యాచులు జరుగుతాయి. జూన్ 26-28 వరకు ఐర్లాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటిస్తుంది. అది ముగిశాక గతంలో ఆగిపోయిన ఐదో టెస్టును జులై 1-5 మధ్య ఆడతుంది. ఆ తర్వాత టీ20, వన్డే సిరీసులు ఉంటాయి. జులై 17తో పర్యటన ముగుస్తుంది. చాలామంది సీనియర్ క్రికెటర్లు బయో బుడగల్లో సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నారు. అందుకే వారిలో కొందరికి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (చర్చల తర్వాత), రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ పవర్‌ప్లేలో 6 ఇన్నింగ్సుల్లో 5 సార్లు ఔటయ్యాడు. కేవలం 6.80 సగటు, 100 స్ట్రైక్‌రేట్‌తో 34 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో 9 మ్యాచులాడి 16 సగటు 119 స్ట్రైక్‌రేట్‌తో 128 పరుగులు చేశాడు. 11 బౌండరీలు, 2 సిక్సర్లు కొట్టాడు. ఇక మిగిలిన మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకుంటాడేమో చూడాలి.