Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ తరఫున సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు.
గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1: 7 బంతుల్లో), జోస్ బట్లర్ (0: 5 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు. స్కోరు బోర్డుపై నాలుగు పరుగులు చేరే సరికి వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అయితే వన్‌డౌన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (26: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు.
ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో రాజస్తాన్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజు శామ్సన్, షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు)కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 27 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. అనంతరం షిమ్రన్ హెట్‌మేయర్ ఎలాంటి పొరపాటు జరగకుండా మ్యాచ్‌ను ముగించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఫాంలో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (4: 3 బంతుల్లో, ఒక ఫోర్) మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) , వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (20: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కానీ ఈ జోడీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. లేని పరుగుకు ప్రయత్నించి సాయి సుదర్శన్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 32 పరుగులు మాత్రమే.
అనంతరం శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) జతకలిశాడు. వీరు మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చాలా వేగంగా ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ అవుటయ్యాక ఆ బాధ్యతను డేవిడ్ మిల్లర్ తీసుకున్నాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగడం విశేషం. డేవిడ్ మిల్లర్‌కు అభినవ్ మనోహర్ (27: 13 బంతుల్లో, మూడు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. తను కూడా సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.