GT vs MI IPL 2023 Qualifier 2:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 రెండో క్వాలిఫయర్‌లో పరుగుల వరద పారింది. మొతేరాలో సిక్సర్ల వర్షం కురిసింది. మోదీ స్టేడియంలో బౌండరీల హోరు సాగింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129; 60 బంతుల్లో 7x4, 10x6) తన సొగసైన బ్యాటింగ్‌తో అభిమానులను ఓలాలాడించాడు. స్టేడియం మొత్తాన్నీ గిల్‌ఫైడ్ చేశాడు. తిరుగులేని విధంగా సీజన్లో మూడో సెంచరీ కొట్టేశాడు. దాంతో సెమీ ఫైనల్ లాంటి ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ముంబయి ఇండియన్స్‌కు 234 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. సాయి సుదర్శన్ (43; 31 బంతుల్లో 5x4, 1x6) టైమ్లీ ఇన్నింగ్స్ ఆడేశాడు.
సరిలేని గిల్!
టాస్‌కు ముందు వర్షం కురవడంతో ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. తేమను ఉపయోగించుకొని వికెట్లు తీయాలని భావించింది. వారి ప్లాన్‌ను పటాపంచలు చేశాడు శుభ్‌మన్ గిల్! కళ్లు చెదిరే సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లే ముగిసే సరికి జీటీని వికెట్ నష్టపోకుండా 50తో నిలిపాడు. పియూష్ చావ్లా వేసిన 6.2వ బంతికి వృద్ధిమాన్ సాహా (18)ని ఇషాన్ స్టంపౌట్ చేశాడు. దాంతో స్కోరు నెమ్మదిస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. సాయి సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 64 బంతుల్లో 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు గిల్!
అటాకింగ్.. మంత్రం!
తొమ్మిది ఓవర్లకు స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకొనేప్పటికీ గుజరాత్ స్కోరు 80/1. బ్రేక్ నుంచి రాగానే బౌండరీ కొట్టి 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు గిల్. ఆ తర్వాత భీకరమైన హిట్టింగ్ చేశాడు. బంతి పట్టుకున్న ప్రతి బౌలర్‌ను అటాక్ చేశాడు. ఎలాంటి బంతులు వేసినా స్టాండ్స్‌లోకి పంపించాడు. దాంతో 14 ఓవర్లకు 147/1 వద్ద ముంబయి రెండో టైమౌట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎన్ని బ్రేక్‌లు వచ్చినా గిల్ అటాకింగ్ మాత్రం ఆపలేదు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 192 వద్ద అతడిని ఆకాశ్ మధ్వాల్ ఔట్ చేశాడు. 214 వద్ద సుదర్శన్ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (28*; 13 బంతుల్లో 2x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి స్కోరును 233/3కు చేర్చాడు.
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జేసన్ బెరెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి