IPL 2025 DC Super Over Victory: ఢిల్లీ అద్భుతం చేసింది. దాదాపుగా ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అసమాన పోరాటంతో విజయం దక్కించుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అలాగే ఈ సీజన్ లో ఐదో విజయాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్లలో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (37 బంతుల్లో 49, 5 ఫోర్లు, 1 సిక్సర్) త్రుటిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకుని , టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ చేసి, రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్ కు దారి తీసింది. యశస్వి జైస్వాల్ (51) సూపర్ ఫిఫ్టీ చేశాడు. కుల్దీప్ యాదవ్, మిషెల్ స్టార్క్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అనంతరం సూపర్ ఓవర్లో ఢిల్లీ పై చేయి సాధించింది.
రాణించిన మిడిలార్డర్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓ మాదిరి ఆరంభం దక్కింది. ఫామ్ లో లేని జాక్ ఫ్రేజర్ (9), కరుణ్ నాయర్ డకౌట్ గా పెవిలియన్ కు చేరారు. ఈ దశలో అభిషేక్.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (38)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అభిషేక్ విధ్వంసకరంగా ఆడగా, రాహుల్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాహుల్.. ఫిఫ్టీకి చేరువలో అభిషేక్ వెనుదిరిగారు. ఈ దశలో అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (34 నాటౌట్)తో వేగంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. అశుతోష్ శర్మ (15 నాటౌట్) అంత వేగంగా ఆడలేకపోయాడు.
ఓపెనర్ల విధ్వంసం.. కాస్త క్లిష్టమైన టార్గెట్ తోనే బరిలోకి దిగిన రాయల్స్ కు ఓపెనర్లు జైస్వాల్, సంజూ శాంసన్ (31 రిటైర్డ్ హర్ట్) మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ చాలా వేగంగా 61 పరుగులు జోడించడంతో తుఫాన్ వేగంతో రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మధ్యలో శాంసన్ గాయంతో వెనుదిరిగినా, జైస్వాల్ మాత్రం.. ధాటిగా ఆడి 34 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. న మధ్యలో రియాన్ పరాగ్ (8) విఫలమైనా, ధ్రువ్ జురెల్ (26 నాటౌట్) తో కలిసి నితీశ్ రాణా (28 బంతుల్లో 51, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కీలకమైన 49 పరుగులను చాలా వేగంగా జోడించారు. ఆ తర్వాత నితీశ్ 26 బంతుల్లో ఫిఫ్టీ చేసిన తర్వత ఔటైనా, జురెల్ , షిమ్రాన్ హిట్ మెయర్ (15 నాటౌట్) తో కలిసి పోరాడాడు. అయితే చివరి ఓవర్లో విజయానికి తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 8 పరుగులు రావడంతో మ్యాచ్ టై అయి, సూపర్ ఓవర్ కు దారి తీసింది.
సూపర్ ఓవర్ లో ఆడారిలా..
2021 తర్వాత ఈ మ్యాచ్ ద్వారానే మెగాటోర్నీలో సూపర్ ఓవర్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ .. పదకొండు పరుగులు మాత్రమే చేసింది. స్టార్క్ బౌలింగ్ వేయగా, రాయల్స్ తరపున రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్ మెయర్ బ్యాటింగ్ కు దిగారు. ఫస్ట్ బాల్ బీట్ కాగా, రెండో బంతికి హిట్ మెయర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి పరాగ్ బౌండరీ బాదాడు. ఇది నోబాల్ కావడం విశేషం. ఆ తర్వాత బంతిని వైడ్ వేయగా, పరాగ్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికి హిట్ మెయర్ భారీ షాట్ ఆడి, రెండు పరుగులకు ప్రయత్నించగా, నాన్ స్ట్రైక్ లో ఎండ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. దీంతో 11 పరుగులే వచ్చాయి.
ఆ తర్వాత ఢిల్లీ తరపున ట్రిస్టన్ స్టబ్స్, కేెఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగారు. సందీప్ శర్మ ఈ ఓవర్ ను వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు చేసిన రాహుల్, రెండో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ను స్టబ్స్ కు ఇచ్చాడు. ఆ తర్వాత బంతిని సిక్సర్ బాదిన స్టబ్స్ కు ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు.