IPL 2025 SRH Suffers 2nd loss: మాజీ చాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఐపీఎల్ లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య డిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్లతో పరాజయం పాలైంది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలన్న సన్ నిర్ణయం బెడిసి కొట్టింది. 18.3 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. యువ బ్యాటర్ అనికేత్ వర్మ (74) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టు బ్యాటర్లు విఫలమైన వేళ, తను పూర్తి విభిన్నమైన క్రికెట్ ఆడాడు. మిషెల్ స్టార్క్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి, కంప్లీట్ చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ మెరుపు ఫిఫ్టీ (27 బంతుల్లో 50, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో జిషాన్ అన్సారీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది.
మళ్లీ విఫలమైన బ్యాటర్లు..గత మ్యాచ్ లోలాగానే ఢిల్లీతోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో తొలి 25 బంతుల్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (32) జంట ఆదుకుంది.వీరిద్దరూ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఐదో వికెట్ కు 77 పరుగులు జోడించింది. అయితే క్లాసెన్ ఔటయ్యాక, మరే బ్యాటర్ నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. అనికేత్ ఒంటరిగా పోరాడి 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో స్కోరు పెంచుదామని ట్రై చేసి ఔటయ్యాడు. ఆ తరవాత మరో 9 బంతులు మిగిలి ఉండగానే, సన్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది.
సూపర్ డుప్లెసిస్.. సింపుల్ టార్గెట్ ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా డుప్లెసిస్, జాక్ ఫ్రేసర్ మెక్ గర్క్ (38)తో కలిసి భారీ షాట్లు ఆడారు. సన్ ఫీల్డర్లు క్యాచ్ లు వదలడం కూడా కలిసొచ్చింది. దీంతో కేవలం 55 బంతుల్లోనే 81 పరుగులను ఈ జంట జోడించింది. ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జీషాన్ అన్సారీ.. మెక్ గర్క్ ని ఔట్ చేసి, తొలి వికెట్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (34 నాటౌట్) తో కలిసి డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ తర్వాత తను ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ (15) వేగంగా ఆడాలని ట్రై చేయి ఔటయ్యాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్) తో కలిసి పోరెల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించింది. స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.