IPL 2024 Auction Date: దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం తేదీని బీసీసీఐ అధికారికంగా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 19వ తేదీన ఈ వేలం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దుబాయ్‌ వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. 






పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఏకంగా 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. అన్ని జట్లలో కలిపి 77 ఖాళీలు ఉండగా.. అందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు. ఈసారి వేలంలో స్టార్‌ ఆటగాళ్లు కూడా చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్ కమిన్స్‌, మిషెల్ స్టార్క్‌, జోష్ హాజిల్‌వుడ్‌ తమ కనీస ధర రూ. రెండు కోట్లుగా పెట్టుకున్నారు.


రానున్న ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు ట్రావిస్‌ హెడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిషెల్‌ స్టార్క్‌‌లకు మంచి ధర లభించే అవకాశం ఉంది. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో కంగారూల జట్టు ఆరోసారి టైటిల్‌ గెలువడంలో వీరు కీలకంగా వ్యవహరించారు. దుబాయ్‌ వేదికగా ఈ నెల 19వ తేదీన జరిగే వేలంలో ఈ ఆసీస్‌ త్రయంరూ.  2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. 


భారత పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, బ్యాటర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ప్రపంచకప్‌లో సత్తా చాటిన కివీస్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలుగా ఉంది. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి రచిన్ రవీంద్ర అమ్ముడయ్యే అవకాశాలున్నాయి. 1166 మంది క్రికెటర్ల జాబితాను ఐపీఎల్‌... అన్ని ఫ్రాంఛైజీలకు పంపింది. ఈ 1166 మంది కోసం ప్రాంచైజీలు ఏకంగా రూ. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ ఆటగాళ్లలో ఫ్రాంఛైజీలు ఆసక్తి ప్రదర్శించిన వారితో తుది జాబితాను రూపొందిస్తారు.


ఐపీఎల్ 2024 వేదికగా ఇప్పటికే పలు వివాదాలు కూడా ప్రారంభం అయ్యాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా తిరిగి ముంబై జట్టులో చేరడంపై పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆజ్యం పోసినట్లు జస్‌ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు మరింత వైరల్‌గా మారింది. కొన్నిసార్లు నిశ్శబ్దమే బెస్ట్ ఆన్సర్‌గా నిలుస్తుందని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.


ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20లకు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నాడనే వార్తల నేపథ్యంలో ఐపీఎల్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌ కావాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపట్టడం ఖాయమని భావిస్తున్న వేళ బుమ్రా అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్‌ శర్మ తర్వాత ముంబై నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే జస్‌ప్రీత్ బుమ్రా ఇన్నాళ్లూ జట్టుతో కొనసాగాడని, హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబైలో చేరడంతో బుమ్రా ఆశలు నెరవేరలేదని మరికొందరు అంటున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply