Ricky Ponting On Rishabh Pant: రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం జట్టు వెతుకుతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ధృవీకరించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గత నెలలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.


ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలు కావడంతో అతను మైదానానికి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు కూడా పంత్ దూరం అయ్యే అవకాశం ఉంది.


పంత్‌తో టచ్‌లో ఉన్నాం...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ తాను పంత్‌తో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. ‘ఇది భయంకరమైన సమయం. అతన్ని ఒంటరిగా వదిలేయండి. అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమిస్తారు. కాబట్టి అతను వీలైనంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తాడని మేం ఆశిస్తున్నాము.’ అని పాంటింగ్ అన్నాడు.


వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతున్నాం
ఐపీఎల్ 2023లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడడం కష్టం. అందుకే ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అతనికి ప్రత్యామ్నాయాలను ఇప్పటికే పరిశీలిస్తున్నాడు. ఈ అంశంపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ, ‘మీరు అతనిలాంటి ఆటగాళ్లను భర్తీ చేయలేరు. పంత్ లాంటి ఆటగాళ్ళు చెట్ల మీద పెరగరు. మేం ఇప్పటికీ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతున్నాం.’ అన్నాడు.


ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ తన కెప్టెన్‌పై చాలా ప్రేమ, గౌరవం చూపించాడు. మ్యాచ్‌లు జరిగినన్ని రోజులూ రిషబ్ పంత్ ఆడకపోయినా తనతో పాటు డగౌట్‌లో కూర్చోవాలని ఆశిస్తున్నట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఐపీఎల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి కెప్టెన్సీకి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం వేరే ఆప్షన్లను వెతుకుతుందేమో చూడాలి.




గబ్బా లో మనోళ్లు చరిత్ర సృష్టించి
నేటితో 2️⃣ సంవత్సరాలు అయ్యాయి! 💥

రిషభ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్ &
🇮🇳 విన్నింగ్ మొమెంట్ ను గుర్తు చేసుకుంటూ
రవి శాస్త్రి గారి స్పీచ్ మీ కోసం! 😎#TeamIndia #BorderGavaskarTrophy #INDvAUS #RishabPant #BelieveInBlue 💙https://t.co/L0DS8dzMf1


— StarSportsTelugu (@StarSportsTel) January 19, 2023