ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌కు సంబంధించి నేడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో నేడు బీసీసీఐ అధికారిక సమావేశం నిర్వహించింది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో సీజన్‌ వేదికపై నిర్ణయం తీసుకుంటారు. రెండు కొత్త ఫ్రాంచైజీలను పరిచయం చేయనున్నారు.


ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ మూడో వేవ్‌ కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కేసులు వస్తున్నాయి. ప్రాణాపాయ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సీజన్‌ను ఎక్కడ నిర్వహించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. సాధ్యమైనంత వరకు భారత్‌లోనే నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకుంటే వేదికను దక్షిణాఫ్రికాకు తరలించాలని భావిస్తోందని తెలిసింది. గత రెండు సీజన్లకు ఆతిథ్యమిచ్చిన యూఏఈపై బోర్డుకు ఆసక్తి లేదని సమాచారం.


'ఐపీఎల్‌ను మేం భారత్‌లోనే నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితి మరీ దిగజారితే విదేశాల గురించి ఆలోచిస్తాం. ఇప్పటికైతే స్వదేశంలో ఆతిథ్యానికే మా ప్రాధాన్యం. ఫిబ్రవరిలో తుది నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌కు తెలిపారు. నేటి సమావేశంలో వేదికపై సుదీర్ఘంగా చర్చ జరపనున్నారు. బ్యాకప్‌ వేదికగా దక్షిణాఫ్రికాను ఎంచుకుంటారని తెలిసింది.


మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో నిర్వహిస్తారని ఇంతకు ముందే చెప్పారు. వాస్తవంగా దీనిపై ఇంకా స్పష్టత లేదు. వేలానికి ముంబయిని ప్రత్యామ్నాయ వేదికగా నిర్ణయిస్తారు. సీజన్‌-15 షెడ్యూలుపైనా చర్చిస్తారు. పనిలో పనిగా అహ్మదాబాద్‌, లక్నో ఫ్రాంచైజీలను అధికారికంగా పరిచయం చేస్తారు.


2020 సీజన్‌ను పూర్తిగా యూఏఈలో నిర్వహించారు. గతేడాది సగం భారత్‌లో మిగతాది దుబాయ్‌లో నిర్వహించారు. ఈసారి మాత్రం అంత ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఎందుకంటే యూఏఈ పూర్తి సీజన్‌కు రూ.100 కోట్లు, సగం సీజన్‌కు రూ.50 కోట్లు తీసుకుంది. అంత చెల్లించడానికి బోర్డు ఇష్టపడటం లేదు. కుదిరితే దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని అనుకుంటోంది. ప్రస్తుతం క్రికెట్‌ దక్షిణాఫ్రికా భారత్‌ జట్టుకు చక్కగా ఆతిథ్యం ఇచ్చింది. క్రికెటర్లూ సంతోషంగా ఉన్నారు. బోర్డుకు మంచి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు.


Also Read: Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!


Also Read: IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?


Also Read: David Warner: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?