Badminton Asia Team Championships 2024: టీమిండియా స్టార్‌ షటర్లు అసలు సిసలు సమరానికి సిద్ధమయ్యారు. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌(Asia Team Championships 2024)కు స్టార్‌ షట్లర్లు సమాయత్తమయ్యారు. ఇవాళ ప్రారంభం కానున్న ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌లో టీమిండియా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. పురుషుల విభాగంలో గ్రూపు-ఎలో భారత్‌, చైనా, హాంకాంగ్‌ తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. 2022లో జరిగిన థామస్‌ కప్‌లో ఛాంపియన్‌, నిరుడు ఆసియా క్రీడల్లో రజత పతక విజేత భారత్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతోంది. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌, లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టిలతో కూడిన భారత బృందం గ్రూపు-ఎలో టాప్‌-2లో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది. ఇక మహిళల విభాగంలో గ్రూపు-డబ్ల్యూలో ఉన్న భారత్‌, చైనా బరిలో ఉన్నాయి. గాయం కారణంగా నిరుడు అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఈ టోర్నీలో ఆడనుంది. సింధు, అష్మిత చాలిహా, గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో పతకం కోసం పోరాడనున్నారు. రేపు జరిగే మ్యాచ్‌ల్లో పురుషుల్లో హాంకాంగ్‌తో ప్రణయ్‌ సేన, మహిళల్లో చైనాతో సింధు బృందం తలపడనుంది. 

 

ఇటీవలె నెంబర్‌ వన్‌ జోడిగా...

భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌(World no1 badminton ranking) కైవసం చేసుకుని తమకు తిరుగులేదని ఇంకొకసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ప్రకటించిన డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్‌ 8వ ర్యాంక్‌ దక్కించుకోగా లక్ష్యసేన్‌ 19వ స్థానంలో నిలిచాడు.

 

ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో....

భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి(Chirag Shetty and Rankireddy) సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. డబుల్స్‌ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు... మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి... మూడో సీడ్‌, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.