IPL 2024: ఐపీఎల్‌ ఫీవ‌ర్ అమాంతం పెరిగిపోయింది క్రికెట్ అభిమానుల్లో. క్రికెటర్లంతా వచ్చి ఆయా ప్రాంఛైజీ ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా కప్‌ ఎత్తుకెళ్లాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నారు. తమ బలాలను పెంచుకోవడం బలహీనలతో అధిగమించడంతోపాటు ప్రత్యర్థుల బలాబలాలపై ఫోకస్ పెడుతున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో ఈసారి మరిన్న రికార్డులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే టోర్నీ ప్రరంభానికి ఇకా మూడు రోజులే మిగిలి ఉన్న టైంలో ఆ మూడు నెంబర్‌తో ఉన్న రికార్డుల దుమ్మును ఓసారి దులుపుదాం. 


క్వింట‌న్ డికాక్ షో
ఐపీయ‌ల్‌లో 3వ స్థానంలో ఉంది క్వింట‌న్ డికాక్ ఆడిన ఒక సూప‌ర్ షో . లక్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున ఆడిన క్వింట‌న్ డికాక్ 70 బంతుల్లో 140 ప‌రుగులు చేశాడు.  2022 మే 18న డివై పాటిల్  స్టేడియంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తో  జ‌రిగిన మ్యాచ్ లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన డికాక్ కోల‌క‌తా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డి చివ‌రివ‌ర‌కు ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. 200 స్ర్టైక్‌రేట్ ఉంది. ఈ ఇన్నింగ్స్ ఐపీయ‌ల్ చ‌రిత్ర లో వేగ‌వంత‌మైన అత్య‌ధిక‌ప‌రుగుల జాబితాలో 3వ  స్థానంలో ఉంది. 


కోహ్లీ కెప్టెన్సీ క‌మాల్‌...
 కింగ్‌కోహ్లీ ఐపీయ‌ల్‌లో ఎక్కువ మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ చేసిన ఆట‌గాడిగా మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టికే ఎవ‌రూ చెర‌ప‌లేని ఎన్నోరికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకొన్న కోహ్లీ... ఎక్కువ మ్యాచ్ ల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. మొత్తం 143 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ చేసిన విరాట్ 66 మ్యాచ్ ల్లో త‌న టీంకు విజ‌యాలు అందించాడు. అయితే ఒంటిచేత్తో త‌మ జ‌ట్టుకు ఎన్నోసార్లు విజ‌యాల‌ను అందించిన కోహ్లీ ఒక్క‌సారి కూడా తమ జ‌ట్టుకు టైటిల్ అందించ‌లేక‌పోవ‌డం నిరాశే మిగిల్చింది. 


నిరాశ‌ప‌ర్చిన న‌రైన్ 
సునీల్‌న‌రైన్.. ఈ కోల్‌క‌తా ఆట‌గాడు ఐపీయ‌ల్ లో ఎక్కువ సార్లు డ‌కౌట్ అయ్యిన మూడో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. 15సార్లు ఇలా డ‌కౌట్ అయ్యి నిరాశ‌గా పెవిలియ‌న్ చేరాడు న‌రైన్‌.  ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొంది వేగంగా ప‌రుగులు చేయాలి అన్న ల‌క్ష్యంతో క్రీజులోకొచ్చిన న‌రైన్‌ను ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్లు ఆ ల‌క్ష్యం నెర‌వేకుండానే ఔట్ చేసేసారు. దీంతో ఖాతా తెర‌వ‌కుండానే ఆ జ‌ట్టు వికెట్ కోల్పోవాల్సి వ‌చ్చింది.


చావ్లా వంతు
 ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్లో అత్య‌ధిక వికెట్లుతీసిన వారిలో మూడ‌వ స్థానంలో కొన‌సాగుతున్నాడు భార‌త మాజీ స్పిన్‌బౌల‌ర్ పీయూష్‌చావ్లా. 179 వికెట్ల‌తో ప్ర‌త్య‌ర్ధి జట్టు వికెట్ల‌ని త‌న ఖాతాలో వేసుకొన్నాడు ఈ లెగ్‌స్పిన్న‌ర్. పొదుపుగా బౌలింగ్ చేయ‌డ‌మే కాదు... గూగ్లీల‌తో బ్యాట్స్‌మెన్ ని బోల్తాకొట్టించ‌గ‌ల చావ్లా 3వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 7.90 ఎకాన‌మీతో బౌలింగ్ చేసే చావ్లా ప్ర‌త్య‌ర్ధి టీంల‌ను ప‌వ‌ర్‌ప్లే లోనే ఇర‌కాటంలో పెట్టేవాడు.


బ‌ట్ల‌ర్ బీభ‌త్సం
జోస్‌బ‌ట్ల‌ర్‌... భీక‌ర ఫాంలో ఉండి ఇప్ప‌టివ‌ర‌కు ఐపీయ‌ల్‌లో 5 సెంచ‌రీలు బాదేసి ఐపీయ‌ల్ అత్య‌ధిక సెంచ‌రీల రికార్డులో 3వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 2016 లో ఐపీయ‌ల్ లో అడుగుపెట్టిన బ‌ట్ల‌ర్ గ‌త సంవ‌త్స‌రం త‌న ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ని ఓ ఆట ఆబుకొన్నాడు. ఐపీయ‌ల్లో 5 సెంచ‌రీలు, 19 హాఫ్ సెంచ‌రీల‌తో మోత మోగించాడు బ‌ట్ల‌ర్ అంతేకాదు కేవ‌లం 95 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సొంతం చేసుకొన్నాడు.


కెరీర్ బెస్ట్ కార్తీక్ 
ఐపీయ‌ల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడి జాబితాలో మూడో స్థానంలోఉన్నాడు... దినేశ్‌కార్తీక్‌. మొత్తం 6 ప్రాంఛైజీల త‌ర‌ఫున ఐపీయ‌ల్ ఆడిన కార్తీక్... ఐపీయ‌ల్ లో 242 మ్యాచ్ లు ఆడి మూడో స్థానంలో నిలిచాడు. 2008లోనే ఐపీయ‌ల్ లో  అడుగుపెట్టిన కార్తీక్ విజ‌య‌వంత‌మైన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. 97 ప‌రుగుల హ‌య్యెస్ట్ స్కోరుతో నిలిచిన కార్తీక్ ఈ సీజ‌న్‌లో ఆడే మ్యాచ్‌ల‌ను బ‌ట్టి త‌న రికార్డ్ మరింత మెరుగు ప‌డ‌టం ఖాయం.


స్ట్రైక్‌రేట్‌ న‌రైన్‌
ఇక ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో బ్యాట్స్‌మెన్ కి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే రికార్డ్‌ని త‌న‌ఖాతాలో వేసుకొన్నాడు స్పిన్ మాంత్రికుడు సునీల్ న‌రైన్‌. ఐపీయ‌ల్ లో ఎక్కువ  స్ర్టైక్‌రేట్ క‌లిగిఉన్న ఆట‌గాళ్ల‌లో 3వ‌ స్థానంలో ఉన్నాడు సునీల్ న‌రైన్‌. ప‌వ‌ర్‌ప్లే లో బ్యాటింగ్ చేసే న‌రైన్‌... బౌండ‌రీలు బాద‌డ‌మే ప‌నిగా పెట్టుకొంటాడు. అదే సునీల్ న‌రైన్ కి ఈ రికార్డ్ సాధించి పెట్టింది. క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో బ్యాటింగ్ లోనూ ఓ రికార్డ్ లిఖించుకొన్నాడు ఈ మాజీ విండీస్ వీరుడు.


రాజ‌స్థాన్ అద్భుతం
ప్ర‌తీ ప‌రుగు కీల‌కమే క్రికెట్ లో. అందుకే బౌండ‌రీ ద‌గ్గ‌ర డైవ్ చేసిమ‌రీ ప‌రుగుల‌ను నియంత్రిస్తుంటారు ఆట‌గాళ్లు. 2,3 ప‌రుగులు కూడా విజేత‌ను నిర్ణ‌యిస్తుంటాయి. గ‌త సీజ‌న్‌లో అలాంటి ఒక రికార్డునే న‌మోదు చేసింది రాజ‌స్థాన్‌రాయ‌ల్స్. 2023 ఏప్రిల్12న జ‌రిగిన మ్యాచ్ అది. చెన్నైసూప‌ర్ కింగ్స్ తో త‌ల‌ప‌డిన రాజ‌స్థాన్ కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్‌రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగుల చేసింది.త‌ర్వాత బ్యాటింగ్ ఆరంభించిన చెన్నైసూప‌ర్ కింగ్స్6 వికెట్లు కోల్పోయి 172 ప‌రుగులే చేశారు. దీంతో 3 ప‌రుగుల తేడాతో గెలిచి మ‌ధుర‌మైన విజ‌యం అందుకొంది రాయ‌ల్స్‌.


భ‌ళా...బెంగ‌ళూరు
 ఐపీయ‌ల్ లో అత్య‌ధిక టీం స్కోర్ విభాగంలో మూడ‌వ‌ స్థానంలో ఉంది... రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. గుజ‌రాత్ ల‌య‌న్స్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా 2016 మే 14న జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఈ ఫీట్ న‌మోదు చేసింది. మెద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు ఇర‌వై ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 248ప‌రుగులు చేసింది. 12.4 ర‌న్‌రేట్ తోఈ ఇన్నిగ్స్ సాగింది. తమ సొంత మైదానంలో అభిమానులు మ‌ద్ద‌తుతో చెల‌రేగింది బెంగ‌ళూరు.  ఐపీయ‌ల్ చ‌రిత్ర‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకి ఇది రెండ‌వ అత్య‌ధిక స్కోరు.


సాహోరే... వృద్ధిమాన్‌
ఐపీయ‌ల్ లో వికెట్‌కీప‌ర్ గా  106 డిస్మిస‌ల్స్ చేసి అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన కీప‌ర్ జాబితా లోమూడో స్థానంలో ఉన్నాడు వృద్ధిమాన్‌సాహా. గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున ఆడుతున్న సాహా 82 క్యాచ్‌లు, 24 స్టంపింగ్స్ చేసి మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 140 ఇన్నింగ్స్‌ల్లో సాహా ఈ రికార్డ్ సాధించాడు. 2008 లో మైద‌లైన వృద్ధిమాన్ సాహా ప్ర‌స్థానం ఇంకా కొన‌సాగుతోంది.