India vs Australia 2022: భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీసుకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఉపఖండం పర్యటన విషయంలో ఆసీస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. కీలకమైన ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌, ఆల్‌రౌండర్లు మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టాయినిస్‌ను ఎంపిక చేయలేదు. చిన్నపాటి గాయాలవ్వడంతో ముందు జాగ్రత్తగా వారిని స్వదేశంలోనే ఉంచుతోంది.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మరో నెల రోజులే ఉంది. కీలకమైన మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లను దృఢంగా ఉంచుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. వరల్డ్‌ ఛాంపియన్‌ టైటిల్‌ను డిఫెండ్‌ చేసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోక తప్పదని భావిస్తోంది. కాలిమడమ గాయంతో మిచెల్‌ మార్ష్‌ ఇప్పటికే జింబాబ్వేతో రెండు, మూడో వన్డే, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలకు దూరమయ్యాడు. కివీస్‌తో రెండో వన్డే సమయంలోనే స్టాయినిస్‌కు స్వల్ప గాయమైంది. టీమ్‌ఇండియా పర్యటనకు బయల్దేరే ముందు మోకాలి గాయంతో స్టార్క్‌ దూరమయ్యాడు. వారి స్థానాల్లో నేథన్‌  ఎల్లిస్‌, డేనియల్‌ సామ్స్‌, సేన్‌ అబాట్‌ను ఆసీస్‌ ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 20 నుంచి మూడు టీ20ల సిరీస్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే.


వాస్తవంగా భారత పర్యటనకు మిచెల్‌ మార్ష్ అందుబాటులో ఉంటాడనే అంతా భావించారు. స్వల్ప పర్యటన, వెంటవెంటనే మ్యాచులు ఉండటంతో విశ్రాంతి తీసుకోవాలని భావించినట్టు తెలిసింది. 'ఆరు రోజుల్లోనే మూడు మ్యాచులు ఉన్నాయి. ఇండియాలో మూడు నగరాలకు ప్రయాణించాలి. అందుకే మార్ష్‌, స్టాయినిస్‌, స్టార్క్‌ స్వదేశంలో ఉండి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు సిద్ధమవ్వడం మంచిదని సెలక్టర్లు నిర్ణయించారు' అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ఇప్పటికే ఈ సిరీసు ఆడనని డేవిడ్‌ వార్నర్‌ ప్రకటించాడు. విశ్రాంతి తీసుకుంటానని చెప్పడం గమనార్హం.


ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌, టిమ్‌ డేవిడ్‌, స్టీవెన్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరాన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌, సేన్ అబాట్‌, ఏస్టన్‌ ఆగర్‌, నేథన్‌ ఎల్లిస్‌, హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇన్‌గ్లిస్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియెల్‌ సామ్స్‌, ఆడమ్‌ జంపా


భారత జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దినేశ్ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, యుజ్వేంద్ర  చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, హర్షల్‌ పటేల్‌, దీపక్ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా