Flashback 2024: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ ఈ ఏడాది జరిగింది. పారిస్‌లో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఆరు పతకాలు సాధించారు. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో ఏడుగురు రిజర్వ్ ఆటగాళ్లతో కలిపి 117 మంది ఆటగాళ్లను భారత్.. పారిస్‌కు పంపింది. అలాగే వాళ్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారులు కూడా వెళ్లారు.
సత్తా చాటిన మనూ భాకర్..
ఇక జూలై 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్యం సాధించింది. ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి మెడల్ కైవసం చేసుకుంది. ఒలింపిక్ షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 10 మి. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో కాంస్యం గెలిచింది. దీంతో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్ సత్తా చాటింది. టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి పతకం సాధించింది. పతక పోరులో దక్షిణ కొరియాను ఓడించింది.
అదర గొట్టిన కుసాలే..
ఇక పురుషుల షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసాలే భారత్‌కు మూడో పతకాన్ని అందించాడు. పురుషుల 50 మి. రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని పొందాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా స్వప్నిల్ నిలిచాడు. నిజానికి ఈ విభాగంలో పతకం ఆశలు లేకపోయినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పతకాన్ని దక్కించుకున్నాడు.
కాంస్య పతకాన్ని నిలబెట్టుకున్న భారత్..
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి 41 సంవత్సరాల పతక కరువును తీర్చిన భారత జట్టు.. ఈ ఎడిషన్‌లోనూ మళ్లీ కాంస్య పతకాన్ని సాధించింది. నిజానికి భారత ఆటతీరును బట్టి, బంగారు పతకాన్ని సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాడ్ లక్ వెంటాడటంతో కాంస్యానికే పరిమితమైంది. పతక పోరులో స్పెయిన్‌ను సునాయాసంగా ఓడించింది.
నీరజ్ చోప్రా.. సిల్వర్ త్రో..
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి సంచలనం రేకెత్తించిన నీరజ్ చోప్రా.. మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. 89.45 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుని, సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక సిల్వర్ మెడల్ ఇదే కావడం విశేషం.
ఇక చివరగా పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల ఈవెంట్లో అమన్ సెహ్రావత్ కాంస్యాన్ని సాధించాడు. ఆగస్టు 9న జరిగిన ఈ పోరులో ప్యూర్టొరికో ప్లేయర్‌ను ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో భారత్ సాథించిన ఏకైక పతకం ఇదే కావడం విశేషం. మరోవైపు వినేశ్ ఫోగట్.. తన విభాగంలో ఫైనల్‌కు చేరినా, బరువు సమస్యతో డిస్ క్వాలిఫై అయింది.