వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. అందరూ ముద్దుగా స్కై అని పిలుచుకునే సూర్య కుమార్ యాదవ్ (65: 31 బంతుల్లో, ఒక ఫోర్, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనకు వెంకటేష్ అయ్యర్ (35 నాటౌట్: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు, వీరిద్దరూ ఐదో వికెట్‌కు 37 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు.


టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్‌తో (34: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలసి రుతురాజ్ గైక్వాడ్ (4: 8 బంతుల్లో, ఒక ఫోర్) ఓపెనింగ్‌కు వచ్చాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ విఫలం అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (25: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అనంతరం వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు.


తొమ్మిదో ఓవర్లో అయ్యర్‌ను వాల్ష్ అవుట్ చేయగా... పదో ఓవర్లో ఇషాన్ కిషన్ వికెట్‌ను రోస్టన్ చేజ్ దక్కించుకున్నాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (7: 15 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్ భారత్‌ను ఆదుకున్నారు.


వీరిద్దరూ ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. కేవలం 37 బంతుల్లోనే ఈ భాగస్వామ్యం రావడం విశేషం. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సూర్య కుమార్ యాదవ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. చివరి ఐదు ఓవర్లలోనే వీరు 86 పరుగులు సాధించారు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్, డొమినిక్ డ్రేక్ తలో వికెట్ తీసుకున్నారు.