అచ్చొచ్చిన ఈడెన్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది! వెస్టిండీస్‌పై తొలి టీ20లో విజయం అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్ల తేడాతో మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4x4, 3x6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇషాన్‌ కిషన్‌ (35; 42 బంతుల్లో 4x4) ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్‌ (34*; 18 బంతుల్లో 5x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (24*; 13 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించాడు. అంతకు ముందు విండీస్‌లో నికోలస్‌ పూరన్‌ (61; 43 బంతుల్లో 4x4, 5x6) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. కైల్‌ మేయర్స్‌ (31; 24 బంతుల్లో 7x4), కీరన్‌ పొలార్డ్‌ (24*; 19 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచారు.


భయపెట్టిన Ro'Hit'


టీమ్‌ఇండియా ఛేదన భిన్నంగా సాగింది! మోస్తరు స్కోరు, డ్యూ ఫాక్టర్‌ వల్ల విజయం సులభమే అనుకున్నారు! కానీ అలా జరగలేదు. విండీస్‌ బౌలర్లు చాలా తెలివిగా, బ్యాటర్ల బలహీనతలే లక్ష్యంగా బంతులేశారు. రెండు ఓవర్ల వరకు పరుగులేం రాలేదు. మూడో ఓవర్‌ నుంచి రోహిత్‌ శర్మ దంచడం మొదలెట్టాడు. సిక్సర్లు, బౌండరీలు కొట్టేయడంతో 6 ఓవర్లకు స్కోరు 58 దాటేసింది. అయితే జట్టు స్కోరు 64 వద్ద ఛేజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టబోయిన రోహిత్‌ ఫీల్డర్‌ స్మిత్‌కు దొరికాడు. మరోవైపు ఇషాన్‌ తన స్టైల్‌కు భిన్నంగా దూకుడుగా ఆడలేదు. ఆఫ్‌సైడ్‌ బంతులతో ఇబ్బంది పడ్డాడు. ఒత్తిడి పెరగడంతో 93 వద్ద ఔటయ్యాడు. వెంటవెంటనే విరాట్‌ కోహ్లీ (17), రిషభ్‌ పంత్‌ (8) ఔటవ్వడంతో ఉత్కంఠ కలిగింది.


Suryakumar yadav షినిషింగ్‌


30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో కుదురుకున్నాడు. అతడికి వెంకటేశ్‌ అయ్యర్‌ అండగా నిలిచాడు. వీరిద్దరూ 26 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య ఒకవైపు కుదురుగా ఆడుతూనే చక్కగా బౌండరీలు దంచేశాడు. అయ్యర్‌ కూడా దొరికిన బంతిని దొరికినట్టే భారీ షాట్లు ఆడటంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. సిరీసులో 1-0తో ముందంజ వేసింది.


Nicholas Pooran షో


టాస్‌ గెలిచిన రోహిత్‌ విండీస్‌ను మొదట బ్యాటింగ్‌కు దించాడు. తొలి ఓవర్‌ ఐదో బంతికే బ్రాండన్‌ కింగ్‌ (4)ను భువీ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్‌ పూరన్‌కు 8 పరుగుల వద్ద లైఫ్‌ దొరికింది. అతడిచ్చిన క్యాచ్‌ను పట్టే క్రమంలో రవి బిష్ణోయ్‌ బౌండరీ లైన్‌ తొక్కేశాడు. దొరికిన అవకాశాన్ని పూరన్‌ చక్కగా వాడుకున్నాడు. మేయర్స్‌ దూకుడుగా ఆడుతుంటే అతడు నిలకడగా ఆడాడు. రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం అందించాడు.


జట్టు స్కోరు 51 వద్ద మేయర్స్‌ను చాహల్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత రోస్టన్‌ ఛేజ్‌ (4), రోవ్‌మన్‌ పావెల్‌ (2)ను వెంటవెంటనే అరంగేట్రం స్పిన్నర్‌ బిష్ణోయ్ ఔట్‌ చేయడంతో విండీస్‌ రన్‌రేట్‌ తగ్గింది. దాంతో బౌలర్లను గౌరవిస్తూనే పూరన్‌ సిక్సర్లు బాదుతూ అర్ధశతకం సాధించాడు. ఆరో వికెట్‌కు పొలార్డ్‌తో కలిసి 25 బంతుల్లోనే 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 18వ ఓవర్లో జట్టు స్కోరు 135 వద్ద పూరన్‌ను హర్షల్‌ పటేల్‌ ఔట్‌ చేసినా ఆఖర్లో పొలార్డ్‌ కొన్ని షాట్లు బాదేయడంతో విండీస్‌ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.