Jasprit Bumrah equals Kapil Dev: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన రికార్డు సృష్టించాడు. లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) రికార్డును సమం చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో అతడీ ఘనత సాధించాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తన వైవిధ్యమైన పేస్‌తో వికెట్లు తీశాడు. ఇండియాలో అతడికి ఇదే ఫస్ట్ ఫిఫర్!


బెంగళూరులో జరుగుతు డే/నైట్‌ టెస్టు జస్ప్రీత్‌ బుమ్రా కెరీర్లో 29వ టెస్టు. ఈ మ్యాచులో అతడు ఎనిమిదో సారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇంత తక్కువ మ్యాచుల్లో ఇండియాలో ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నది కేవలం కపిల్‌ దేవ్‌ మాత్రమే. మరెవ్వరూ వీరిద్దరికీ చేరువలో లేరు.


ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలో జస్ప్రీత్‌ బుమ్రా తలో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా, ఇండియాలో ఒక్కోసారి అందుకున్నాడు. మొత్తంగా డే/నైట్‌ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన నాలుగో ఇండియన్‌ బౌలర్‌గా బుమ్రా రికార్డు దక్కించుకున్నాడు. అతడికన్నా ముందు అక్షర్‌ పటేల్‌ రెండుసార్లు, ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ ఒక్కోసారి సాధించారు. శ్రీలంకపై బుమ్రాకు 5/24 బెస్ట్‌ ఫిగర్స్‌ కావడం గమనార్హం.


IND vs SL 2nd Test:  టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 35.5 ఓవర్లకు 109 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 252 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. జస్ప్రీత్‌ బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 86/6తో రెండో రోజు ఆట ఆరంభించిన లంకను చుట్టేయడానికి రోహిత్‌ సేనకు ఎంతో సమయం పట్టలేదు. 27 నిమిషాల్లోనే మిగిలిన 4 వికెట్లను పడగొట్టేసింది. ఆడిన 35 బంతుల్లో 23 పరుగులు మాత్రమే చేసింది. ఇండియాపై శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం ప్రత్యేకం.