IND vs SL, 3rd T20, ACA-VDCA Stadium: హమ్మయ్య..! ఐదు టీ20ల సిరీస్‌పై టీమ్‌ఇండియాకు ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. వైజాగ్‌ టీ20లో విజయ దుందుభి మోగించడంతో టోర్నీ సజీవంగా మారింది. నిర్ణయాత్మక పోరులో రిషభ్‌ పంత్‌ సేన ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. వారి సమష్టి పోరాటానికి అందరి నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయి. భారత్‌ గెలుపునకు ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.


పాజిటివ్‌ ఆటిట్యూడ్‌


వైజాగ్‌ టీ20లో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ కోల్పోయినట్టే! అప్పటి వరకు ఈ మైదానంలో ఛేదన జట్లదే పైచేయి. అందుకే సెంటిమెంటు పరంగా టాస్ ఎంతో కీలకం. అలాంటి టాస్‌ను కెప్టెన్‌ రిషభ్ పంత్‌ ఓడిపోయాడు. అయినా అతడితో సహా జట్టు మొత్తం సానుకూల దృక్పథంతో మ్యాచ్‌ ఆడింది. వారి కసి, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ గెలుపునకు ఒక ముఖ్య కారణం.


ఓపెనర్ల దూకుడు


తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) విఫలమయ్యాడు. ఈసారి మాత్రం రెచ్చిపోయాడు. ఆన్రిచ్‌ నోకియా వేసిన ఐదో ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలు బాదేసి పవర్‌ప్లేలో మంచి స్కోరు అందించాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) హాఫ్‌ సెంచరీలు చేయడంతో శుభారంభం దక్కింది. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) నిలదొక్కుకోవడంతో డిఫెండబుల్‌ స్కోరు వచ్చింది.


బౌలర్లకు హ్యాట్సాఫ్‌


ఈ మ్యాచులో బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌కే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. అందరూ సమష్టిగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra chahal), హర్షల్‌ పటేల్‌ (Harshal Patel) బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. వీరిద్దరే 7 వికెట్లు పడగొట్టాడు. హెండ్రిక్స్‌, మిల్లర్‌, రబాడా, శంషిని హర్షల్‌ పెవిలియన్‌ పంపించాడు. ప్రిటోరియస్‌, డుసెన్‌, క్లాసెన్‌ను యూజీ ఔట్‌ చేశాడు. సఫారీ జట్టులో వీరే ప్రధాన బ్యాటర్లు కావడం గమనార్హం.


పంత్‌ కెప్టెన్సీ


టీమ్‌ఇండియా గెలుపునకు రిషభ్ పంత్‌ (Rishabh Pant) కెప్టెన్సీ ఒక కారణమే. టాస్‌ ఓడినా అతడు పాజిటివ్‌గా కనిపించాడు. పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం వహించాడు. సమయోచితంగా బౌలర్లను ఉపయోగించాడు. ఐదో ఓవర్‌ నుంచి వరుసగా యూజీకి మూడు ఓవర్లు ఇవ్వడంతో ప్రత్యర్థికి ఉక్కిరి బిక్కిరి అయింది. అతడు వికెట్లు తీయడంతో సఫారీలపై ఒత్తిడి పెరిగింది. అతడికి తోడుగా హర్షల్‌ను దించాడు. ఈ వ్యూహం బాగా పనిచేసింది. మిగతా వారినీ చక్కగా వినియోగించాడు.


వైజాగ్‌ సెంటిమెంట్‌


విశాఖ టీమ్‌ఇండియా గెలుపు అడ్డా! అని చెప్పొచ్చు. ఇక్కడ ఎప్పుడు మ్యాచులు జరిగినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా మారుతుంటాయి. విజయాల శాతం ఇక్కడ 86 వరకు ఉంది. కీలక మ్యాచులు ఎప్పుడు జరిగినా వైజాగ్‌లో విజయాలు సాధిస్తుంటుంది. సెంటిమెంటు పరంగా ఇదీ కలిసొచ్చింది.