IND vs SA 3rd T20: దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. అచొచ్చిన విశాఖపట్నంలో దుమ్మురేపింది. ప్రత్యర్థి ముందు 180 టార్గెట్ ఉంచింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7x4, 2x6), ఇషాన్ కిషన్ (54; 35 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. హార్దిక్ పాండ్య (31; 21 బంతుల్లో 4x4, 0x6) ఆఖర్లో దంచికొట్టాడు. టీమ్‌ఇండియా ఆరంభం అందిరినా ముగింపు కోరుకున్నట్టుగా లేదు. తొలి 73 బంతుల్లో 126/1 చేయగా ఆఖరి 47 బంతుల్లో 53/4 మాత్రమే చేశారు.
ఈ సారి గైక్వాడ్
ఐదు టీ20ల సిరీసులో సఫారీలు 2-0తో ఆధిక్యంలో ఉండటంతో టీమ్‌ఇండియాకు ఇది చావోరేవో మ్యాచ్! ఇలాంటి నిర్ణయాత్మక పోరులోనూ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ ఓడిపోవడం అన్‌లక్కీ! దాంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. కీలక మ్యాచులో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. తొలి మూడు ఓవర్లు నిలకడగా ఆడినా నోకియా వేసిన ఐదో ఓవర్లో గైక్వాడ్ వరుసగా 5 బౌండరీలు కొట్టి జోరు పెంచాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కిషన్ సైతం 31 బంతుల్లో అర్ధశతకం చేయడంతో 10.5 ఓవర్లకు స్కోరు 100 దాటింది.
ప్రమాదకరంగా మారిన ఓపెనింగ్ జోడీని జట్టు స్కోరు 97 వద్ద రుతురాజ్‌ను ఔట్ చేయడం ద్వారా మహరాజ్ విడదీశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (13), రిషభ్ పంత్ (6), దినేశ్ కార్తీక్ (6) వరుసగా ఔటయ్యారు. హార్దిక్ మాత్రం అలాగే ఉండి చక్కని షాట్లు ఆడి స్కోరును 179/5కు తీసుకెళ్లాడు. ప్రిటోరియస్ 2, మహరాజ్, శంషి, రబాడా తలో వికెట్ తీశారు.