భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్ 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (11 బ్యాటింగ్: 57 బంతుల్లో, ఒక ఫోర్), కీగన్ పీటర్సన్ (14 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్. అయితే బౌలింగ్ చేసేటప్పుడు తొడ కండరాలు పట్టేయడంతో సిరాజ్ మైదానం నుంచి వెనుదిరిగాడు.


కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి 14 ఓవర్ల పాటు భారత్ ఓపెనర్లు బాగానే ఆడారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మయాంక్ అగర్వాల్‌ (26: 37 బంతుల్లో ఐదు ఫోర్లు) అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 24వ ఓవర్లో చతేశ్వర్‌ పుజారా (3: 33 బంతుల్లో), అజింక్య రహానే (0: 1 బంతి) కూడా పెవిలియన్ బాట పట్టారు. మూడు వికెట్ల నష్టానికి 53 పరుగుల స్కోరుతో భారత్ మొదటి సెషన్‌ను ముగించింది.


లంచ్ తర్వాత హనుమ విహారి (20: 53 బంతుల్లో, మూడు ఫోర్లు), కేఎల్ రాహుల్ కాసేపు వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 42 పరుగులు జత చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అయితే ఇదే సెషన్‌లో విహారి, రాహుల్ ఇద్దరూ షార్ట్ పిచ్ బంతులను అంచనా వేయలేక అవుటయ్యారు. టీ విరామానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.


అనంతరం భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసిపోయింది. ఒకవైపు అశ్విన్ క్రీజులో ఉన్నా... అవతలి ఎండ్‌లో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నిదానంగా ఆడిన పంత్ (17: 43 బంతుల్లో, ఒక్క ఫోర్) కూడా దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.


ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన అశ్విన్ (46: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు).. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. ఆ తర్వాత బుమ్రా (14 నాటౌట్: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా.. సిరాజ్ (1: 6 బంతుల్లో) రబడ బౌలింగ్‌లో అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.


ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (7: 12 బంతుల్లోనే) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. ఈ వికెట్ షమీకి దక్కింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను బుమ్రా వదిలేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో తొడ కండరాల గాయంతో సిరాజ్ మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు.