దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా యువ పేసర్‌ మార్కో జన్‌సెన్‌ మాటల యుద్ధానికి దిగారు. పరస్పరం కవ్వించుకున్నారు. నువ్వా నేనా అనుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడుతుండటం గమనార్హం.  భారత రెండో ఇన్నింగ్స్‌లో 54వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.






వాండరర్స్‌ టెస్టు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆధిక్యం 200 పరుగులు దాటింది. మహ్మద్‌ షమి ఔటవ్వగానే జస్ప్రీత్‌ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 54వ ఓవర్లో మార్కో జన్‌సెన్‌ను అతడు ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కే ఆడతారు. యువ పేసర్‌కు బుమ్రా ఎన్నో మెలకువలు నేర్పించాడు. కానీ తమ దేశాల తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం సీరియస్‌నెస్‌ ప్రదర్శించారు.


ఈ ఓవర్లో అన్ని బంతులను జన్‌సెన్‌ బౌన్సర్లుగానే సంధించాడు. ఓ బంతి బుమ్రా భుజాన్ని తాకడంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. అయినప్పటికీ చిరునవ్వుతోనే కనిపించాడు. మరో బంతీ అలాగే వేశాడు. ఆ సమయంలో ఇద్దరూ సీరియస్‌గా మారి ఒకర్నొకరు మాటలు అనుకున్నారు. ఈ కోపంతోనే రబాడ వేసిన తర్వాతి ఓవర్లో బుమ్రా సిక్సర్‌ బాదేశాడు. 56 ఓవర్లో మళ్లీ జన్‌సెన్‌ను ఎదుర్కొన్నాడు. తర్వాత ఎంగిడి వేసిన ఓవర్లో రెండో బంతికి జన్‌సెన్‌కే  క్యాచ్‌ ఇచ్చాడు.


ఇంగ్లాండ్‌ సిరీసులోనూ బుమ్రా ఇలాగే ఆంగ్లేయులను ఎదుర్కొన్నాడు. జేమ్స్‌ అండర్సన్‌కు బౌన్సర్లు సంధించాడు. ఆ తర్వాత బుమ్రాను లక్ష్యంగా ఎంచుకొని అండర్సన్‌ మిగతా పేసర్లు బౌన్సర్లు సంధించారు. కానీ బుమ్రా అర్ధశతకంతో వారికి బదులిచ్చాడు. ఆ తర్వాత ఈ వివాదం కొన్ని రోజులు సాగింది. ఒకప్పుడు పేసర్ల మధ్య ఓ అవగాహన ఉండేది. ప్రత్యర్థి పేసర్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు బౌన్సర్లు సంధించేవారు కాదు. ఇప్పుడా పద్ధతి మారింది. బౌలర్లు కూడా పరుగులు చేస్తుండటమే ఇందుకు కారణం.