భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. మంగళవారం రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అజింక్య రహానే (11 బ్యాటింగ్: 22 బంతుల్లో, ఒక ఫోర్), చతేశ్వర్ పుజారా (35 బ్యాటింగ్: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగలిగింది. దీంతో ఆతిథ్య జట్టుకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.


27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (8: 21 బంతుల్లో, ఒక ఫోర్) ఏడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 24 మాత్రమే. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (23: 37 బంతుల్లో, ఐదు ఫోర్లు) కూడా ఆ తర్వాత కాసేపటికే అవుట్ అవ్వడంతో భారత్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. పిచ్ పేస్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో టెస్టు స్పెషలిస్టులు అయిన వీరిద్దరూ మూడో రోజు ఫాంలోకి వచ్చి ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్ విజయావకాశాలు మెరుగు పడినట్లే.


అంతకుముందు దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌట్ అయింది. కీగన్ పీటర్సన్ (62: 118 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. టెంపా బవుమా (51: 60 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఏకంగా ఏడు వికెట్లు తీయగా.. షమికి రెండు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్న ప్రతిసారీ శార్దూల్ ఠాకూర్ భాగస్వామ్యాలను బ్రేక్ చేశాడు.