India vs New Zealand 3rd ODI, Team India Playing 11: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ గురువారం (జనవరి 24వ తేదీ) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఇండోర్ చేరుకున్నాయి. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై కన్నేసింది. అదే సమయంలో కివీ జట్టు తన పరువు కాపాడుకోవడానికి చివరి మ్యాచ్‌లో గెలవాలని కోరుకుంటుంది.


ఇప్పటికే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వవచ్చు. రెండో వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చివరి మ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు.


నిజానికి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల టెస్టులు ఆడనుంది. దీంతో జట్టులో ఉన్న చాలా మంది సీనియర్ ఆటగాళ్లు మూడో వన్డేలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.


మూడో వన్డేలో మహమ్మద్‌ షమీ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వవచ్చని పలువురు క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఒకసారి ఉండండి.


ఇషాన్ కిషన్, రోహిత్ ఓపెనింగ్... రజత్ పాటిదార్ అరంగేట్రం ఫిక్స్!
మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని వార్తలు వస్తున్నాయి. కింగ్ కోహ్లి స్థానంలో అతను వన్‌డౌన్‌లో ఆడే అవకాశం ఉంది. అదే సమయంలో శుభమాన్ గిల్‌కు బదులుగా హిట్‌మాన్‌తో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయవచ్చు.


రెండో మ్యాచ్ ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ పిచ్ గురించి పెద్ద కామెంట్ చేశాడు. అయితే మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీల బౌలింగ్‌ను కూడా ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ, "మా బ్యాటింగ్ అంత బాగా లేదు. భారత జట్టు సరైన ఎండ్‌లో ఎక్కువ సేపు బౌలింగ్ చేసింది. మ్యాచ్ జరిగినప్పుడు ఏదీ మాకు అనుకూలంగా జరగలేదు. ఈ పిచ్‌కు టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది. బౌలర్లకు ఈ పిచ్ సహకరిస్తుంది. దురదృష్టవశాత్తు మేం ప్రారంభంలో మంచి భాగస్వామ్యాలను నిర్మించలేకపోయాం." అన్నాడు. భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 11 ఓవర్లలో 15/5కు కట్టడి చేశారు. మహ్మద్ షమీ తన ఆరు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.


మూడో వన్డేలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, రజత్ పటీదార్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్