Ishan Kishan After Double hundred: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ 2023లో అంత ఫాంలో కనిపించట్లేదు. అతను 2022 డిసెంబర్ 10వ తేదీన డబుల్ సెంచరీ చేయడం ద్వారా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇషాన్ బ్యాట్ నుంచి మెరుపులు రాలేదు. అతను ఈ సిరీస్‌లో కేవలం ఎనిమిది సగటుతో, 60 స్ట్రైక్ రేట్‌తో మొత్తంగా 24 పరుగులు మాత్రమే చేశాడు.


బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ మొత్తం మూడు వన్డేలు, ఆరు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇన్ని మ్యాచ్‌ల్లోనూ ఇషాన్‌ బ్యాట్‌ నుంచి కనీసం హాఫ్‌ సెంచరీ రాలేదు. ఈ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు కేవలం 37 పరుగులు మాత్రమే. ఈ పరుగులు కూడా శ్రీలంకతో ఆడిన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వచ్చినవి. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ సెంచరీ అతనికి పెద్దగా లాభదాయకంగా లేదని గణాంకాలు చూస్తుంటే చెప్పొచ్చు.


డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ అంతర్జాతీయ ఇన్నింగ్స్
జనవరి 3వ తేదీన శ్రీలంకతో తొలి టీ20 ఇంటర్నేషనల్ - 37 పరుగులు.
జనవరి 5వ తేదీన శ్రీలంకతో రెండో టీ20 ఇంటర్నేషనల్ - 2 పరుగులు.
జనవరి 7వ తేదీన శ్రీలంకతో మూడో టీ20 ఇంటర్నేషనల్ - 1 పరుగు.
జనవరి 18వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే – 5 పరుగులు.
జనవరి 21వ తేదీన న్యూజిలాండ్‌తో రెండో వన్డే - 8* పరుగులు.
జనవరి 24వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే - 17 పరుగులు.
జనవరి 27వ తేదీన న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఇంటర్నేషనల్ - 4 పరుగులు.
జనవరి 29వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ - 19 పరుగులు.
ఫిబ్రవరి 1వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ - 1 పరుగు.


ఇషాన్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున మొత్తం 13 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. వన్డేల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 46.09 సగటుతో 507 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను 26 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో 26.08 సగటు, 123.25 స్ట్రైక్ రేట్‌తో 652 పరుగులు చేశాడు.


ఇషాన్ కిషన్ తన మొదటి సెంచరీ, డబుల్ సెంచరీని సాధించాక కూడా సంతృప్తి చెందలేదు. ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం మిస్ అయినందుకు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.


“నేను 14.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఔట్ అయ్యాను. చివరి వరకు క్రీజులో ఉంటే 300 స్కోరును కూడా సాధించేవాడినేమో.” అని కిషన్ ఇన్నింగ్స్ విరామం సమయంలో అన్నాడు. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ మైలురాయిని చేరుకున్న క్రిస్ గేల్ వన్డే ఫార్మాట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీని అందుకున్నాడు. 24 ఏళ్ల ఇషాన్ కిషన్ కెరీర్‌లో ఇది కేవలం 10వ వన్డే మాత్రమే. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్ 36వ ఓవర్లో ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అప్పటికే ఇషాన్ కిషన్ 210 పరుగులు సాధించాడు.


ఈ జార్ఖండ్ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడుసార్లు ఈ ఫీట్‌ను సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.