2022లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆస్ట్రేలియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ టికెట్ల వ్యవహారం ఎంత రసాభాసగా మారిందో అందరికీ తెలిసిందే. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) రాబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ కోసం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు విక్రయించాలని నిర్ణయించింది.


జనవరి 18వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఆర్‌జీఐసీఎస్)లో జరగనున్న వన్డే టిక్కెట్లను శుక్రవారం నుంచి పేటీఎం యాప్, వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ విలేకరులకు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం అస్సలు ఉండదు.


నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన అజహర్ జనవరి 15వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంల్లో తప్పనిసరిగా ఫిజికల్ కాపీలను కూడా తీసుకోవాలని తెలిపారు.


వినియోగదారులు ఫిజికల్ టిక్కెట్‌లను రీడీమ్ చేయడానికి కౌంటర్‌ల వద్ద ధృవీకరణ కోసం వారి ఫోటో ఐడీతో పాటు పేటీయం నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌ను చూపించాల్సి ఉంటుంది. టిక్కెట్లు జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య Paytm లో అందుబాటులో ఉంటాయి.


మొదటి రోజు 6,000 టిక్కెట్లు, మరుసటి రోజు నుంచి 7,000 టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. స్టేడియంలో 39,112 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. 9,695 టిక్కెట్లను కాంప్లిమెంటరీ టిక్కెట్‌లుగా కేటాయించిన తర్వాత, 29,417 టిక్కెట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి.


రూ.850, రూ.1,000, రూ.1,250, రూ.1,500, రూ.2,500, రూ.5,000, రూ.9,000, రూ.17,700, రూ.20,650 రేంజ్‌లో టిక్కెట్‌లు ఉండనున్నాయి. ఒక వ్యక్తి కేవలం నాలుగు టిక్కెట్ల వరకు మాత్రమే కొనుగోలు చేయగలడు.