IND vs ENG, 5th Test, Edgbaston Stadium: అనుకున్నదే జరిగింది! ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీసు గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు అడియాసలే అయ్యాయి! ఆంగ్లేయులను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించాలన్న కోరిక నెరవేరలేదు. నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత్‌ ఓటమి చవిచూసింది. కనీసం మ్యాచును డ్రా చేసుకోలేక చేతికిందిన సిరీసును వదిలేసింది! ఎడ్జ్‌బాస్టన్‌లో 378 పరుగుల టార్గెట్‌ను స్టోక్స్‌ సేన అలవోకగా ఛేదించింది. మరో 7 వికెట్లు ఉండగానే గెలుపు తలుపు తట్టింది. ఐదు టెస్టుల సిరీసును 2-2తో ముగించింది. మాజీ కెప్టెన్‌ జో రూట్‌, జానీ బెయిర్‌స్టో తిరుగులేని సెంచరీలతో అదరగొట్టారు. 


ఐదో రోజు, మంగళవారం ఓవర్‌నైట్‌ స్కోరు 259/3తో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. విజయానికి అవసరమైన 119 పరుగుల్ని 20 ఓవర్లలోనే కొట్టేసింది. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 76తో క్రీజులోకి దిగిన మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (142*; 173 బంతుల్లో 15x4, 1x6) స్వేచ్ఛగా ఆడేశాడు. 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌ సిరీసు నుంచి విధ్వంసకరంగా ఆడుతున్న జానీ బెయిర్‌ స్టో (114*; 173 బంతుల్లో 19x4, 1x6) రెండో ఇన్నింగ్సులోనూ శతకం అందుకున్నాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 316 బంతుల్లో 269 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్‌ఇండియా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బంది పడ్డారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆంగ్లేయులకు కంచుకోట. ఇప్పటి వరకు అక్కడ వారికి ఓటమే లేదు.


నాలుగో రోజు, సోమవారం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 132 పరుగులతో కలిపి ఇంగ్లండ్ ముందు 378 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెతేశ్వర్ పుజారా (66: 168 బంతుల్లో, 8 ఫోర్లు), రిషబ్ పంత్ (57: 86 బంతుల్లో, 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ (4: 3 బంతుల్లో), హనుమ విహారి (11: 44 బంతుల్లో, ఒక ఫోర్) త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (20: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పేలవ ఫామ్‌ చాటాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, పుజారా మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగించారు. హాఫ్‌ సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన పుజారాను (66: 168 బంతుల్లో, రెండు ఫోర్లు) స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (19: 26 బంతుల్లో, మూడు వికెట్లు) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. రిషబ్ పంత్ (57: 86 బంతుల్లో, 8 ఫోర్లు) కూడా కాసేపటికే అవుటయ్యాడు. దాంతో భారత్‌ 198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లు రాణించకపోవడంతో కావాల్సినంత ఆధిక్యం భారత్‌కు లభించలేదు.