IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో ఉత్కంఠ ఎప్పుడూ భిన్నమైన స్థాయిలో కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరిగే పోరు కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అంతకుముందు, కంగారూ జట్టు 2017లో భారత్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో జరిగిన పుణే టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 333 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.


సొంత గడ్డపై ఆడేటప్పుడు టీమిండియా ప్రధాన బలం స్పిన్. గింగిరాలు తిరిగే బంతులను ఆడలేక ఎంతో గొప్ప లెజండరీ బ్యాట్స్‌మెన్ కూడా సులభంగా బోల్తా పడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఈ ఆస్ట్రేలియా మన వేలితో మన కన్నే పొడిచింది. స్పిన్ బలంతోనే ఈ మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంది.


ఈ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు స్పిన్ వలలో చిక్కుకుంది. నిజానికి మ్యాచ్ తొలిరోజు నుంచే పిచ్‌లో చాలా టర్న్ కనిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌటైంది.


దీని తర్వాత స్టీవ్ ఒకీఫ్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో కంగారూ జట్టు కేవలం 105 పరుగులకే భారత్‌ను ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో 13.1 ఓవర్లు వేసిన స్టీవ్ ఒకీఫ్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు.


తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులు సాధించింది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ 109 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 441 పరుగులు సాధించింది.


17 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా స్పిన్నర్లు
ఈ పుణె పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో 441 పరుగుల లక్ష్యాన్ని సాధించడం ఏ జట్టుకు అంత తేలికైన విషయం కాదు. భారత జట్టు ఆటతీరులో కూడా అదే కనిపించింది. అక్కడ భారత జట్టు 107 పరుగులకే కుప్పకూలింది. భారత్ నుంచి ఈ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు.


ఆస్ట్రేలియా జట్టు తరఫున స్టీవ్ ఒకీఫ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టగా, నాథన్ లియాన్ మిగతా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్లు మొత్తం 17 వికెట్లు తీశారు. అయితే దీని తర్వాత భారత జట్టు సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. రెండో, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లను కూడా గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్య నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మధ్య ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక మూడో టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 5వ తేదీ దాకా ధర్మశాలలో జరగనుంది. మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ దాకా అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.