వచ్చే నెలలో జరగబోయే T20 వరల్డ్‌ కప్‌ కోసం పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కి చోటు దక్కలేదు. సీనియర్ ఓపెనర్ ఫకార్ జమాన్‌‌ని రిజర్వ్‌లో ఉంచారు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. 






బాబర్‌ అజమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఉన్నారు. కాగా ఫకార్‌ జమాన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ప్రకటించారు. యువ ఆటగాడు అజమ్‌ ఖాన్‌ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షా లాంటి కొత్త మొహాలు జట్టులో ఉన్నారు. ఇక పాక్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌, మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. 


గ్రూప్-2లో ఉన్న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్లో అక్టోబరు 24న భారత్‌ను ఢీకొట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మెగా టోర్నీ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ భారత్‌పై పాకిస్థాన్ గెలవలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌, భారత్‌ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూప్ - 2లో భాగంగా భారత్‌, పాకిస్థాన్, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్, బి1 క్వాలిఫయర్‌, ఏ2 క్వాలిఫయర్‌ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్థాన్ టీమిండియాతో అక్టోబర్‌ 24న తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


టీ20 వరల్డ్‌కప్‌కి పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారీస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, కౌదిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హసనైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ అఫ్రిది, సోహెబ్ మక్సూద్.






టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ జట్టును ప్రకటించిన కొద్దిసేపటికే ఆ జట్టు హెడ్ కోచ్ మిస్బా ఉల్ హాక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేశారు. జట్టు ప్రకటించిన తర్వాతే వీరు రాజీనామా చేయడంతో అభిమానులకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.