Formula E Racing : హైదరాబాద్ లో ఫార్ములా ఈ కారు రేసింగ్ గ్రాండ్ గా ముగిసింది. రేస్ ముగిసిన తర్వాత ఆయా కంపెనీలు తమ డెమో కార్లను గ్యారేజీల్లో ప్రదర్శనకు ఉంచాయి. రేస్ ను చూసేందుకు వచ్చిన వీక్షకులకు ఆ రేస్ కార్ల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు. హుస్సేన్ సాగర తీరాన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫార్ములా ఈ కార్‌ రేసు విజయవంతంగా ముగిసింది.  జీన్‌ ఎరిక్ మొదటి స్థానంలో నిలిచాడు. విజేతలకు మంత్రి కేటీఆర్ ట్రోఫీ అందించారు.  



రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిన కార్లు 


హైదరాబాద్ ఫార్ములా ఈ కారు రేస్‌ అట్టహాసంగా ముగింది. 25 పాయింట్లతో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలవగా, నిక్‌ క్యాసిడి 18 పాయింట్లతో రెండో స్థానంలో, 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో రేస్ ముగించారు. భారత మోటార్‌ స్పోర్ట్స్‌లో నూతన అధ్యయనానికి హైదరాబాద్‌ వేదికైందని నిర్వాహకులు అన్నారు. ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్న ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో నిర్వహించడంపై ప్రశంసలు అందుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేస్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. పలు దేశాల నుంచి వచ్చిన రేసర్స్ అత్యంత వేగంతో దూసుకెళ్లారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహీంద్రా కార్లు ఈ రేస్ లో పాల్గొన్నాయి. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన ప్రధాన రేస్‌లో జా ఎరిక్‌ వా మొదటి స్థానంలో నిలిచి ట్రోఫీ అందుకున్నారు.


 


రేస్ ను వీక్షించిన ప్రముఖులు 


హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్‌ రేస్‌ను వీక్షించేందుకు క్రికెటర్లు, సినిమా స్టార్స్ , ప్రముఖులు భారీగా తరలివచ్చారు. క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, యజువేంద్ర చాహల్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సంతోష్‌, ఎంపీ రామ్మెహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌, నటుడు రాంచరణ్‌, నటుడు జొన్నలగడ్డ సిద్ధార్థ, నాగార్జున, అఖిల్, నాగచైతన్య హాజరయ్యారు. వేగంగా దూసుకెళ్తున్న కార్లను చూసి వీక్షకులు కేరింతలు కొట్టారు. 


 సందడిగా మారిన రేసింగ్ ట్రాక్ పరిసరాలు 


హైదరాబాద్‌ ఫార్ములా ఈరేస్‌ మొదటి రోజు సందడిగా సాగింది. ఈవెంట్‌కు సినీ, స్పోర్ట్స్ సెలబ్రెటీలు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా నగరవాసులు వచ్చి రేస్‌ను ఎంజాయ్ చేశారు. భారీగా వచ్చిన జనంతో ట్యాంక్‌బండ్‌ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  భారత్‌లో తొలిసారిగా అదీ హైదరాబాద్‌లో జరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి ఫార్మూలా రేస్ లవర్స్ ఇక్కడకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ప్రారంభంకాగా ఉదయం నుంచే ఫ్యాన్స్ గ్యాలరీలకు చేరుకున్నారు. భవిష్యత్తు అంతా ఈ కార్స్ దే కాబట్టి మంత్రి కేటీఆర్ ఆలోచన ఇనీషియేటివ్ అద్భుతంగా ఉందంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్‌ ఫార్ములా ఈరేసింగ్‌లో ఈ ఉదయం క్వాలిఫైంగ్ రౌండ్ జరిగింది. దీన్ని చూసేందుకు క్రికెటర్లు వచ్చారు. సందడి చేశారు. సచిన్‌, చాహల్, దీపక్ చాహర్ ఈ వెంట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.   హైదరాబాద్‌ ఫార్ములా ఈరేస్‌లో ఆర్జే సూర్య సందడి చేశాడు. గ్యాలరీల్లో తిరుగుతూ రేస్ ను వీక్షించాడు. ఏపీబీ దేశంతో మాట్లాడిన ఆర్జే సూర్య పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ ఈ రేస్ కు వస్తే ఎలా ఉంటుందో ఇమిటేషన్ చేసి చూపించాడు.