అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్‌ గోల్‌కీపర్‌ అయిన రజని భారత మహిళా జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది. గోల్‌కీపర్‌ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. 2009లో అరంగేట్రం చేసిన తనకు ఒలింపిక్స్‌, వరల్డ్‌కప్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాగే 2016 ఆసియా చాంపియన్‌షిప్స్‌, 2017 మహిళల హాకీ ఆసియాక్‌పలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలు. భారత మహిళల జుట్టుకు మహిమా చౌదరి (వైస్‌ కెప్టెన్‌), బన్సారి సోలంకి, అక్షత అబాసో, జ్యోతి ఛెత్రి, మరియానా కుజుర్‌, ముంతాజ్‌ఖాన్‌, అజ్మినా కుజుర్‌, రుతుజ పిసల్‌, దీపిక సోరెంగ్‌ ఎంపికయ్యారు. నమీబియా, పోలెండ్‌, అమెరికాతో కలిసి భారత జట్టు గ్రూపు-సిలో ఉంది. 

 

పురుషుల జట్టుకు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హాకీ ఇండియా  ప్రకటించింది. పురుషుల జట్టులో మన్‌దీప్‌ మోర్‌ (వైస్‌ కెప్టెన్‌), సూరజ్‌ కార్కేరా, ప్రశాంత్‌కుమార్‌ చౌహాన్‌, మన్‌జీత్‌, మహ్మద్‌ రహీల్‌ మౌసీన్‌, మణిందర్‌ సింగ్‌, పవన్‌ రాజ్‌భర్‌, గుర్‌జోత్‌ సింగ్‌, ఉత్తమ్‌ సింగ్‌ స్థానం సంపాదించారు. గ్రూపు-బిలో భారత్‌, ఈజిప్ట్‌, జమైకా, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 24 నుంచి 27 వరకు మహిళలు, 28 నుంచి 31 వరకు పురుషుల టోర్నీలు జరుగుతాయి. 

 

ఏమిటీ.. హాకీ ఫైవ్స్‌

టీ20 క్రికెట్‌ తరహాలోనే హాకీ ఫైవ్స్‌ అనేది సూపర్‌ ఫాస్ట్‌గా ముగిసే మ్యాచ్‌. కేవలం 20 (10+10) నిమిషాలపాటు మాత్రమే ఆట సాగుతుంది. మధ్యలో రెండు నిమిషాల విరామం ఉంటుంది. అలాగే రెగ్యులర్‌ హాకీ మ్యాచ్‌లా 11 మంది కాకుండా ఇందులో గోల్‌కీపర్‌తో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే ఆడుతారు.నలుగురు సబ్‌స్టిట్యూట్స్‌లను అనుమతిస్తారు. విస్తీర్ణం కూడా రెగ్యులర్‌ కోర్టులో సగం మాత్రమే ఉంటుంది. ‘డీ’ సర్కిల్‌ కూడా కనిపించదు. దీంతో మైదానంలో ఎక్కడి నుంచైనా ప్లేయర్‌ గోల్‌ చేయవచ్చు. తొలిసారిగా 2014 యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో అడుగిడిన ఈ క్రీడ, ఇప్పుడు 60 దేశాల్లో ప్రాచుర్యం పొందింది.

 

జూనియర్‌ హాకీలో తప్పని పరాజయం

జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో మూడోసారి కప్పు అందుకోవాలన్న యువ భారత్‌ ఆశలు ఈసారి కలలుగానే మిగిలిపోయాయి. అద్భుత విజయాలతో సెమీస్‌ వరకు వచ్చిన టీమిండియా... కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీ ముందు నిలవలేక పోయింది. కప్పు కలను నెరవేర్చుకునే క్రమంలో అడుగు దూరంలోనే ఆగిపోయింది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో దారుణంగా విఫలమైన టీమిండియా.. సెమీస్‌లో 1-4తో జర్మనీ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట ఆరంభమైన కాసేపటికే జర్మనీ ఆటగాడు బెన్‌ హస్బాచ్‌ గోల్‌ చేశాడు. దీంతో జర్మనీ 0-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ భారత ఆటగాడు సుదీప్‌ చిర్మకో 11 వ నిమిషంలో గోల్‌ సాధించి భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. కానీ 30 వ నిమిషంలో జర్మనీ తరఫున బెన్‌ హస్బాచ్‌ మరో గోల్‌ చేయగా... పాల్‌ గ్లాండెర్‌ 41వ నిమిషంలో.. ఫ్లోరియన్‌ స్పెర్లింగ్‌ 58వ నిమిషంలో గోల్స్‌ చేశారు. ఈ గోల్స్‌తో జర్మనీ 4-1తో తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లు భారత్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా ఒక్క కూడా గోల్‌ కూడా కొట్టలేకపోయారు. కానీ జర్మనీ తనకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచింది. జర్మనీ జట్టు ప్రత్యర్థికి బంతి దొరక్కుండా వ్యూహాత్మకంగా ఆడింది. ఈ ఏడాది జర్మనీతో ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పు సాధించాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది.