Virat Kohli 100th Test: టీమ్‌ఇండియా (Team India) మాజీ సారథి విరాట్‌ కోహ్లీపై (Virat Kohli) కెప్టెన్సీ భారం పడినట్టు ఎప్పుడూ అనిపించలేదని మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ (Sunil gavaskar) అన్నారు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరో ఇన్నింగ్సులో అతడు సెంచరీలూ కొడుతూ పోయాడని పేర్కొన్నారు. త్వరలో జరిగే శ్రీలంక టెస్టు (IND vs SL Test series) సిరీసులో అతడు సెంచరీ కొడతాడని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాలపై మాత్రం విరాట్‌ ఫోకస్‌ చేయాలని సూచించారు.


కెప్టెన్సీ భారం లేదు


'విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాయకత్వ భారం తన బ్యాటింగ్‌పై పడినట్టు అనిపించలేదు. ఒక ఇన్నింగ్స్‌ తర్వాత మరొకదాంట్లో అతడు సెంచరీలు కొట్టాడు. అందుకే అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి ఉందని నేననుకోను. ఒక కెప్టెన్‌గా అతడు మిగతా అందరి గురించీ ఆలోచించాల్సి ఉంటుంది. ఇది సాధారణమే. బౌలర్ల ఫామ్‌ గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా గాయాలు అయ్యాయా? బ్యాటింగ్‌ యూనిట్‌లో 4, 5 స్థానాల్లో వచ్చేవారు బాగా ఆడటం లేదా, మరీ ఘోరంగా ఔటవుతున్నారా వంటివి చూసుకోవాల్సి వస్తుంది' అని సన్నీ అన్నారు.


ఇకపై భయం లేదు


'ఒక కెప్టెన్‌గా పరుగులు చేస్తూనే ఉండొచ్చు. కానీ ప్రతిసారీ జట్టులోని అందరి గురించీ ఆలోచించాల్సి వస్తుంది. అలాంటప్పుడే బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేని పరిస్థితులు వస్తుంటాయి. నాయకుడిగా లేనప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టొచ్చు. అదో పెద్ద అడ్వాంటేజ్‌.  ఇప్పుడు విరాట్‌ తన షాట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరుగులు చేస్తున్నంత వరకు అతడు మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు' అని గావస్కర్‌ పేర్కొన్నారు.


Virat Kohli 100th Test


విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం తన వందో టెస్టు మ్యాచుకు సిద్ధమవుతున్నాడు. మొహాలిలో (Mohali) శ్రీలంకతో తలపడనున్నాడు. మార్చి 4 నుంచి ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. కెప్టెన్‌గా విరాట్‌  68 టెస్టుల్లో 54.80 సగటుతో 5,864 పరుగులు చేశాడు. రెండున్నరేళ్లుగా అన్ని ఫార్మాట్లలో కలిపి అతడు సెంచరీలు కొట్టలేదు. జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేస్తున్నా అతడి నుంచి అభిమానులు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. తన మునుపటి స్థాయికి తగినట్టు ఆడాలని కోరుకుంటున్నారు. మరో స్పెషల్‌ ఏంటంటే ఈ మ్యాచుకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తున్నారు.