Happy Birthday Arshdeep Singh: భారత జట్టులో గత ఏడాది కాలంలో ఏ బౌలర్ గురించి అయినా అత్యధికంగా చర్చ జరిగిందంటే అది లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. తన పదునైన యార్కర్లతో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్ష్‌దీప్ సింగ్ 1999 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన మధ్యప్రదేశ్‌లోని గుణాలో జన్మించాడు. 2018 సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 24 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ తన కెరీర్‌ను ప్రారంభించాడు.
దీని తర్వాత 2019 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడే అవకాశం అర్ష్‌దీప్ సింగ్‌కు లభించింది. ఇక్కడ నుండి అతని క్రికెట్ ప్రయాణం పూర్తిగా భిన్నమైన వేగంలో సాగింది. భారత జట్టుకు చేరుకునే తలుపులు కూడా తెరుచుకున్నాయి. అర్ష్‌దీప్ సింగ్‌కు ఐపీఎల్‌లో తన మొదటి సీజన్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో అతను మూడు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.
ఐపీఎల్ 2021 సీజన్ అర్ష్‌దీప్ సింగ్‌కు చాలా కలిసొచ్చింది. అక్కడ అతను పంజాబ్ కింగ్స్‌కు ఆడుతూ 12 మ్యాచ్‌లలో 19 సగటుతో మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. తరువాతి సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు సాధించగలిగాడు. దీంతో అతను భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు.
2022లో భారత జట్టు తరఫున అవకాశం
2022 సంవత్సరంలో అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. అతను ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన టీ20 సిరీస్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన తొలి ఓవర్‌నే మెయిడిన్‌గా విసిరి రికార్డు బుక్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 3.3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మొత్తం రెండు వికెట్లు తీశాడు.
అర్ష్‌దీప్ సింగ్ వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం రాలేదు. 2022 సంవత్సరంలోనే న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కి అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అతను తన అరంగేట్రం మ్యాచ్‌లో 8.1 ఓవర్లు బౌలింగ్‌లో చేశాడు. కానీ వికెట్‌ను పొందలేకపోయాడు.
అర్ష్‌దీప్ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మూడు వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో ఇంతవరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మాత్రం 41 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు తీశాడు అర్ష్‌దీప్ సింగ్. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున చోటు దక్కించుకునే అవకాశం ఉంది. టీ20ల్లో టీమిండియా తరఫున కీలకమైన 19వ ఓవర్ వేస్తున్నది అర్ష్‌దీప్ సింగ్‌నే.
ఇటీవలే పుణె వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన నో బాల్స్‌తో టీమిండియా కొంప ముంచాయి. దీంతో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మొత్తం ఐదు నో బాల్స్ చేశాడు. మ్యాచ్‌లో అత్యంత ఎక్స్‌పెన్సివ్ బౌలర్ అయ్యాడు. రెండో టీ20లో విజయం సాధించిన శ్రీలంక సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.